గజేంద్ర మోక్షణం

Update: 2018-01-18 09:45 GMT

పోతన భాగవతంలో శరణాగతికి సంబంధించి గజేంద్ర మోక్షణాన్ని మన పెద్దలు భిన్న కోణాల్లో దర్శింపచేస్తారు. నా అంత వాడు లేడన్నది గజేంద్రుడి నమ్మకం. నిజంగా కూడా వాడి బలానికి కొండలు పిండి అయ్యేవి , పులులు , సింహాలు భయపడి పారిపోయేవి. మొసలితో పోరాటం కూడా మాములుగా చేయలేదు. చివరి రక్తపు బొట్టు వరకు గెలవగలననే అనుకున్నాడు . 

మనమూ అంతే - నా బలం , నా తెలివి తేటలు , నా కార్యదక్షత , నేను , నా . . .అనే అంటూ ఉంటాం . 

కొంచెం పరిస్థితులు పట్టుదప్పగానే దేవుడికే పరీక్షలు పెడతాం. నువ్వు ఉంటే - నన్ను గట్టెంకించాలి , నువ్వున్నది నిజమయితే - మా అమ్మాయికి పెళ్లి కావాలి - అంటూ ఆయన ఉనికిని కాపాడుకోమని ఆయనకే సవాలు విసురుతాం. 
ఆతరువాత - ఆయనతో డీల్ పెట్టుకుంటాం - పరీక్షలో పాస్ చేయిస్తే - గుండు కొట్టించుకుంటా , నీ హుండీలో వంద రూపాయలు వేస్తా , మెట్లెక్కి వస్తా , కళ్యాణం చేయిస్తా , అది చేస్తే సత్యనారాయణ వ్రతం చేస్తా . ఇది చేస్తే గుడి కట్టిస్తా . ఇలా అన్నిటికీ మనవి అగ్రిమెంట్లే , దేవుడికి లంచమో , కమిషనో ఆఫర్ చేస్తాం .  ఈ మాత్రం ఆఫర్ ఇచ్చే వారు కరువయ్యారు అనుకుని పాపం ఆయన చేస్తున్నాడేమో ? 


చాలాసార్లు అలా చేయకపోతే నేను లేనని అనుకుంటారేమోనని ఆయన చేయాల్సి వస్తుందట . 
భాగవతంలోనే ఒకచోట - వాడు నాకొరకు రక్షింపవలయు - అన్నాడు శ్రీహరి . నేనున్నానని నిరూపించుకోవడానికయినా , లేదా నాకోసం భక్తుడిని రక్షించాల్సిందే - అన్నది ఆయన విధానం . 

గజేంద్రుడు కూడా మనలాగే - మొదట నువ్వున్నావా లేవా అన్నాడు , తరువాత ఉంటే గింటే రక్షించు అన్నాడు , చివర నీవే తప్ప - ఇంకెవరు కాపాడతారు అన్నాడు . సంపూర్ణ శరణాగతి మాటలతో చెప్పినంత సులభం కాదు . చాలా పరిపక్వత కావాలి . నిర్మలమయిన భక్తి పరీక్షల కుంపటి మీద కాగి కాగి - శరణాగతి మీగడ కట్టాలి , ఆ మీగడ వెన్న కావాలి , అది ఇంకా చిలికి చిలికి  నెయ్యి కావాలి. 

మనమెక్కడున్నామో ?

Similar News