తాజ్‌మహల్‌పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

Update: 2018-07-11 11:43 GMT

తాజ్‌మహల్‌ సంరక్షణపై సుప్రీం కోర్టు బుధవారం సంచలన వ్యాఖ్యలు చేసింది. కేంద్రం, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాలు తాజ్‌ మహల్‌ బాగోగులను పట్టించుకుంటాయన్న ఆశ లేదని వ్యాఖ్యానించింది. ఇప్పటికైనా తాజ్‌ మహల్‌ వంటి ప్రపంచ అద్భుతాన్ని పట్టించుకోకపోతే దాన్ని మూసివేస్తామని హెచ్చరించింది.‘‘తాజ్ మహల్‌ను పునరుద్ధరించండి లేదా కూల్చేయండి. లేకుంటే మేమే తాజ్‌మహల్‌కు తాళం వేయాల్సి ఉంటుంది...’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తాజ్ మహల్‌ను కాపాడి, పరిరక్షించడంపై స్పష్టమైన విధానాన్నిరూపొందించడంలో విఫలమైన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపైనా సుప్రీం మండిపడింది. ఈ అపురూపమైన స్మారక కట్టడాన్ని కాపాడేందుకు తీసుకున్న చర్యలపై కేంద్ర ప్రభుత్వం పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించింది.
 
తాజ్ మహల్‌పై పార్లమెంటు స్టాండింగ్ కమిటీ నివేదిక ఇచ్చినప్పటికీ కేంద్రం కనీస చర్యలు తీసుకోలేదని జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా ఐఐటీ- కాన్పూర్‌ నేతృత్వంలో ప్రస్తుతం తాజ్ మహల్ చుట్టూ వాయు కాలుష్య స్థాయిలను అంచనా వేస్తోందనీ.. నాలుగు నెలల్లో ఈ నివేదికను సమర్పిస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. తాజ్ మహల్ లోపల, పరిసర ప్రాంతాల్లో వాయుకాలుష్యానికి గల కారణాలను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీని కూడా నియమించినట్టు పేర్కొంది. కాగా ఈ నెల 31 నుంచి తాజ్ మహల్‌ అంశంపై రోజువారీ విచారణ చేపడతామని సుప్రీం పేర్కొంది.

Similar News