15 మందితో రెడీ అయిన కాంగ్రెస్ రెండో జాబితా..

Update: 2018-11-14 04:46 GMT

ఎట్టకేలకు తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ మిగతా అభ్యర్ధులను కూడా ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. రెండు విడతల్లో మిగిలిన అభ్యర్ధులను ప్రకటించాలని భావిస్తోన్న కాంగ్రెస్ 15మందితో రెండో జాబితాను ఇవాళ అనౌన్స్  చేసేందుకు సిద్ధమవుతోంది. దీంతో ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 65మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్ ఇప్పుడు సెకండ్ లిస్ట్ ను విడుదల చేసేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది. అభ్యర్థుల తుది జాబితాను సిద్ధం చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం సమాలోచనలు చేస్తోంది. సెకండ్ లిస్టును కూడా మంగళవారమే ప్రకటించాలని భావించింది. అర్ధరాత్రి వరకు రెండో జాబితా అభ్యర్ధుల ఎంపికపై చర్చలు జరిగినా హైకమాండ్ నుంచి ఆమోదం లభించకపోడంతో రెండో లిస్టుతో పాటు మూడో జాబితాను కూడా ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది. 

సామాజిక సమీకరణాలు, మిత్రపక్షాల జాబితాలను పరిగణలోకి తీసుకొని రెండో జాబితాను ఎంపిక చేయాలని అధిష్టానం సూచనలు చేసింది. రాహుల్ తో భేటీ తరువాతే తుది జాబితాకు ఆమోదముద్ర వేయాలని భావించారు. ఢిల్లీలోని కర్ణాటక భవన్‌లో తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంచార్జ్ సెక్రటరీలు సమావేశమయ్యారు. రెండో జాబితాపై సమాలోచనలు చేశారు. ఈ జాబితాలో యాకత్‌పురా, బహదూర్‌ పురా, సికింద్రాబాద్, బోద్, నిజామాబాద్, ఇల్లందు, దేవరకొండ, ఖానాపూర్, నారాయణపేట్, ఖైరతాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించబోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. 
 
సామాజిక వర్గాల సమతుల్యంతో రెండవ జాబితాకు కాంగ్రెస్ అధిష్టానం తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. 10 నియోజకవర్గాల అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం. మరో ఐదు పేర్లు ఖరారుపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రెండో జాబితాలో 15మంది అభ్యర్థులు, మూడో జాబితాలో 14మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నట్లు సమాచారం. 

Similar News