కర్నాటక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ హవా

Update: 2018-11-06 10:58 GMT

కర్ణాటక ప్రజలు ఉప ఎన్నికల్లో జేడీఎస్-కాంగ్రెస్ కూటమికే జై కొట్టారు. కన్నడనాట బీజేపీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ కంచుకోట శివమొగ్గలో తప్ప మిగతా నాలుగు చోట్ల కాంగ్రెస్-జేడీఎస్ కూటమి సత్తా చాటింది. రికార్డు మెజార్టీతో సీఎం కుమారస్వామి భార్య గెలుపుతో కర్ణాటక ఉపఎన్నిల్లో బీజేపీకి చావుదెబ్బ పడింది. కాంగ్రెస్-జేడీఎస్ కూటమి వ్యూహం ముందు కాషాయపార్టీ కూలబడింది. మూడు లోక్‌సభ, రెండు శాసనసభ స్థానాలు సహా మొత్తం ఐదు స్థానాల్లో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి నెగ్గాయి. సీఎం కుమారస్వామి రాజీనామాతో ఖాళీ అయిన రామనగరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన భార్య అనితాకుమారస్వామి ఘన విజయం సాధించారు. ఆమె లక్షా 9వేల 137 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో జేడీఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరీకరించేందుకు ప్రయత్నించేవారికి ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు అని సీఎం కుమారస్వామి అన్నారు. తాజా ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఉపఎన్నికలు జరిగిన ఐదు స్థానాల్లో నాలుగు చోట్ల బీజేపీ ఘోర పరాజయం పొందడంతో ఆ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద సందడి లేక వెలవెలబోయింది. వచ్చే ఏడాది ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్న బీజేపీకి తాజా ఎన్నికల ఫలితాలు కోలుకోలేని షాక్ ఇచ్చినట్టు కనిపిస్తోంది.

Similar News