తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో తొలిరోజు రచ్చ

Update: 2018-03-12 09:52 GMT

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజే కాంగ్రెస్ రచ్చకు దిగింది. రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటామని ముందే హెచ్చరించిన కాంగ్రెస్.. చెప్పినట్టుగానే తీవ్ర ఆందోళనకు దిగింది. కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన హద్దులు దాటింది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విసిరిన మైక్ మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు తగలడంతో తొలిరోజు బడ్జెట్ సమావేశాలు రసాబాసాగా మారాయి.

తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వ వాణి వినిపించేందుకు గవర్నర్ నరసింహన్ శాసనసభకు వచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి హరీష్ రావు పుష‌్పగుచ్చాలతో గవర్నర్‌ను ఆహ్వానించారు. ప్రభుత్వ, విపక్ష సభ్యులు శాసనసభలోని తమ స్థానాల్లోకి వచ్చారు. గవర్నర్ ప్రసంగం ఆలస్యంగా ప్రారంభమవడంతో ప్రభుత్వం క్రమశిక్షణ తప్పిందంటూ జీవన్ రెడ్డి గట్టిగా అన్నారు. గవర్నర్ ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణ అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిని గవర్నర్ తన ప్రసంగంలో వినిపించారు. 

రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గవర్నర్ బడ్జెట్ ప్రసంగాన్ని అడ్డుకుంటామని ముందే హెచ్చరించిన ప్రభుత్వం శాసనసభలో ఆందోళన ప్రారంభించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్ల కార్డులు ప్రదర్శించారు. ప్రసంగాన్ని అడ్డుకునే క్రమంలో గవర్నర్‌పైకి కాంగ్రెస్ సభ్యులు.. ప్రసంగ పత్రాలను చించి విసిరారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరిస్తామని అంతకు ముందే కేసీఆర్ హెచ్చరించిన నేపథ్యంలో మార్షల్స్ కాంగ్రెస్ సభ్యులను నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు మార్షల్స్‌తో వాగ్వివాదానికి దిగారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తే ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. 

గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగానే ఈ వివాదం మరింత ముదరడంతో కాంగ్రెస్ సభ్యులు గట్టిగా నినాదాలు చేస్తూ, గవర్నర్‌పైకి పేపర్లు విసిరారు. ఈ క్రమంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మైక్, హెడ్ ఫోన్స్‌ను విసిరారు. కోమటిరెడ్డి విసిరిన ఒక హెడ్ ఫోన్ గాంధీ ఫోటోను తాకి మండలి చైర్మన్ స్వామి గౌడ్‌ కంటికి తగలడంతో ఆయన కన్నుకు గాయమైంది. ఈ గొడవ సాగుతుండగానే గవర్నర్ ప్రసంగం ముగించడంతో అసెంబ్లీ వాయిదా పడింది. కంటికి దెబ్బ తగలడంతో స్వామి గౌడ్‌ను సరోజిని కంటి ఆస్పత్రికి తరలించారు. 

Similar News