సెక్షన్ 127ను బయటికి తీసిన ఎన్నికల కమిషన్...సభలను అడ్డుకుంటే కేసులే!

Update: 2018-10-31 05:20 GMT

ఎలక్షన్ కమిషన్ సెక్షన్ 127ను బయటికి తీసింది. ఒక పార్టీ సభలను మరో పార్టీ శ్రేణులు అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు పంపింది. సెక్షన్ 127ను ఇంప్లిమెంట్‌ చేయాలంటూ కలెక్టర్లకు, ఎస్పీలకు ఆదేశించిన ఈసీ కేసులు నమోదుచేసి చర్యలు చేపట్టాలని సూచించింది. అయితే సమస్యలపై ప్రజలు నిలదీసినప్పుడు మాత్రం ఈ సెక్షన్ వర్తించదని ఎలక్షన్ కమిషన్ క్లారిటీ ఇచ్చింది.

రాజకీయ పార్టీల బహిరంగ సభలను ఎవరైనా అడ్డుకుంటే చర్యలు తప్పవని ఎలక్షన్ కమిషన్‌ హెచ్చరించింది. సెక్షన్ 127ను బయటికి తీసిన ఎన్నికల కమిషన్‌ ఒక పార్టీ సభలను మరో పార్టీ నేతలు గానీ, కార్యకర్తలు గానీ, సానుభూతిపరులు గానీ, ప్రజలు గానీ అడ్డుకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. తమ సభలను ప్రత్యర్ధులు అడ్డుకుంటున్నారంటూ వివిధ పార్టీలు చేసిన ఫిర్యాదులపై స్పందించిన ఈసీ ఆ మేరకు చర్యలు చేపట్టింది. సెక్షన్ 127ను ఇంప్లిమెంట్‌ చేయాలంటూ జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించింది. రాజకీయ పార్టీలు, నేతలు అనుమతి తీసుకుని నిర్వహించే సభలను ఎవరైనా అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. సెక్షన్ 127 కింద కేసు నమోదైతే 6నెలల జైలుశిక్ష లేదా రెండు వేల రూపాయల జరిమానా లేదా రెండు శిక్షలు కూడా విధించే అవకాశముందని ఎలక్షన్ కమిషన్ హెచ్చరించింది. కరీంనగర్‌, మెదక్‌, ఖమ్మం జిల్లాల్లో ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయని సీఈవో రజత్‌కుమార్‌ తెలిపారు. అయితే తమ సమస్యలను పరిష్కరించాలంటూ అభ్యర్ధిని ప్రజలు నిలదీసినప్పుడు మాత్రం ఈ సెక్షన్ వర్తించదని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ప్రజలు వాళ్ల సమస్యల గురించి అడగడంలో తప్పులేదని ఈసీ అభిప్రాయపడింది.

Similar News