హస్తం పార్టీలో ఉపఎన్నికల భయం

Update: 2018-03-19 10:04 GMT

తెలంగాణ కాంగ్రెస్‌కు ఎన్నికలంటే భయం పట్టుకుందా? నల్గొండ, అలంపూర్ స్థానాలకు ఉపఎన్నికలు వస్తే గ్రూపు తగాదాలు కొంప ముంచుతాయని హస్తం పార్టీ భయపడుతోందా?  తమను ఆదుకొనేదెవరని నేతలు ఆందోళన పడుతున్నారా? తాజపరిణమాలు గమనిస్తే అవుననే అనిపిస్తోంది.

గవర్నర్ ప్రసంగం సమయంలో దురుసుగా వ్యవహరించారనే కారణంతో కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్‌లపై ప్రభుత్వం సభా బహిష్కరణ వేటేసింది. నల్లగొండ, ఆలంపూర్ నియోజకవర్గాలు ఖాళీ అయినట్టు ఎన్నికల కమిషన్‌కు తెలిపింది. వెంటనే గెజిట్ కూడా విడుదల చేయడంతో హస్తం పార్టీలో ఉపఎన్నికల భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది. 

సాధారణ ఎన్నికల ముందు సెమీఫైనల్‌గా ఈ రెండుస్థానాల్లో ప్రభుత్వం ఉపఎన్నికలకు పోతే తమ పరిస్థితేంటని కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. దక్షిణ తెలంగాణలో పార్టీ బలంగా ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు గొప్పగా చెబుతున్నారు. అందుకే అక్కడే  సెమీఫైనల్ కు సిద్ధం కావాలని అధికార టీఆర్ఎస్ పార్టీ సవాలు విసురుతోంది.

ఆ రెండు  జిల్లాల్లోని పార్టీలో గ్రూపు రాజకీయాలు జోరుగా ఉండటంతో ఎన్నికలొస్తే ఎట్లా అనే మీమాంసలో పడ్డట్టు తెలిసింది. ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కి ధీటైన సమాధానం చెబుతామని అంటున్నా.. అది మేకపోతు గాంభీర్యమనే అనిపిస్తోంది. ఎందుకంటే నల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్‌కు పీసీసీ అధ్యక్షుడికి అస్సలు పడదు. ఇక అలంపూర్‌లో మాజీ మంత్రి డీకే అరుణకు, ఎమ్మెల్యే సంపత్ కుమార్ పడడంలేదు.  ఉపఎన్నికలొస్తే ఒక్క జట్టుగా పనిచేసి విజయం సాధించాలని తద్వారా ప్రభుత్వానికి డేంజర్ బెల్స్‌ మోగించాలని కాంగ్రెస్ తహతహలాడుతోంది. అయితే గ్రూపు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన పార్టీలో నేతలు తమ ఐక్యతను ఏ మేరకు చాటి చెబుతారనేది ఆసక్తికరంగా మారింది.

Similar News