ఆధార్‌ అడిగితే రూ.కోటి జరిమానా!

Update: 2018-12-20 04:50 GMT

నిన్నటి వరకు అన్నింటికి ఆధారే ఆధారమన్న కేంద్రం వెనక్కు తగ్గింది. అయిన దానికి కాని దానికి ఆధార్‌తో అనుసంధానం అంటున్న వివిధ శాఖలకు ఊహించని ఝలక్ ఇచ్చింది. ఇకపై  ఏ  సంస్థ అయినా చిరునామా ధ్రువీకరణ, గుర్తింపు కోసం ఆధార్‌ అడిగితే కోటి రూపాయల మేర జరిమానా విధించేలా  నిబంధనలు సవరించింది. దీంతో పాటు 3 నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష విధించనున్నారు. ఈ మేరకు సవరించిన నిబంధనలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 
  
వ్యక్తిగత గోప్యతతో పాటు వివిధ అంశాలపై సందేహాలు వ్యక్తమవుతున్న నేపధ్యంలో  సుప్రీం మార్గదర్శకాలకు అనుగుణంగా నిబంధనలను సవరించింది. ఇకపై బ్యాంకు ఖాతాలు తెరవాలన్నా సిమ్‌ కార్డు కొనాలన్నా ఆధార్ అవసరం లేదు.  రేషన్‌కార్డు, పాస్‌పోర్టులకు దరఖాస్తు చేసే సమయంలో ఆధార్‌ ఇవ్వవలసిన అవసరం లేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ నిధులతో అందించే సంక్షేమ పథకాలకు మాత్రమే ఆధార్‌ను తప్పనిసరంటూ స్పష్టత నిచ్చింది. వినియోగదారులు తమ ఇష్టపూర్వకంగా ఆధార్‌ గుర్తింపు కార్డును కేవైసీ ప్రక్రియకు ఉపయోగించుకొవచ్చంటూ సవరణ చేసింది.

సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా రాష్ట్రాలు ఆధార్‌ను తప్పనిసరి చేసుకునేలా అక్కడి ప్రభుత్వాలకు వెసులుబాటు కల్పించాలని కూడా కేంద్రం నిర్ణయించింది. ఇక మైనర్లుగా ఉన్నప్పుడు ఆధార్‌ నమోదు చేసుకున్నవారు 18 ఏళ్లు నిండిన తర్వాత ఆధార్‌ ఉండాలా వద్దా నిర్ణయం తీసుకోవచ్చంటూ తెలిపింది. ఆధార్‌పై సుప్రీంకోర్టు తీర్పు మేరకు భారత టెలీగ్రాఫ్‌, పీఎంఎల్‌ఏ చట్టాలకు కేంద్రం సవరణలు చేసింది. పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఆధార్‌ నమోదు సమయంలో సేకరించే వివరాలను దుర్వినియోగం చేస్తే  50లక్షల రూపాయల జరిమానాతో పాటు పదేళ్ల జైలు శిక్ష విధించనున్నారు. ఇకపై వినియోగదారుడి అనుమతి లేకుండా ఆధార్‌ ధ్రువీకరణ కోసం వివరాలు సేకరిస్తే  10వేల రూపాయల జరిమానాతో పాటు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. క్యూఆర్‌ కోడ్స్‌ ద్వారా చేసే ఆఫ్‌లైన్‌ వెరిఫికేషన్లకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని కేంద్రం ప్రకటించింది. 
 

Similar News