పేరులో నేముంది.. కేటీఆర్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

Update: 2018-05-24 12:26 GMT

తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు ఆ పేరెలా వచ్చిందో తెలిసిపోయింది. దాని వెనుక ఉన్న కథ గుట్టు వీడిపోయింది. అన్న ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ సమక్షంలోనే కేటీఆర్ తన పేరు విషయంలో ఇన్నాళ్లూ ఉన్న రహస్యాన్ని విప్పిచెప్పారు. 

ఈ పేరు.. వెండితెరపై నవరసాలను ఒలికించింది.. ఈ పేరు.. నట విశ్వరూపాన్ని ప్రదర్శించింది..  ఈ పేరు.. ఆంధ్ర రాజకీయాలను మలుపు తిప్పింది.. ఈ పేరు.. తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది..  అదే నందమూరి తారకరామారావు. తెలుగుదేశానికి.. తెలుగుదనానికి ఓ బ్రాండ్‌. నవరస నటనాసార్వభౌముడిగా.. తిరుగులేని నాయకుడిగా.. ఆంధ్రదేశాన సార్థకం చేసుకున్న పేరది. అయితే ఆయనపై ఉన్న అభిమానంతో తారకరామారావు పేరును ఇప్పటికే చాలామంది పెట్టుకున్నారు. అందులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు.. తెలంగాణ ఐటీ, పంచాయితీ రాజ్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఒకరు. అయితే ఆయన పేరు కూడా అన్న ఎన్టీఆర్ ను స్పూర్తిగా తీసుకునే పెట్టారని అందరూ అనుకుంటూ ఉంటారు. 

ఆనాడు.. అన్నగారి పిలుపుతో.. కాంగ్రెస్‌ నుంచి తెలుగుదేశం పార్టీలోకొచ్చిన ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు.. ఎన్టీఆర్ అంటే వల్లమాలిన అభిమానం. అందుకే ఆయన మీదున్న అభిమానంతోటే.. తన తనయుడికి తారకరామారావు అని పేరు పెట్టారని చెబుతారు. అయితే ఇప్పటివరకు ఆ విషయాన్ని బహిరంగంగా ఎవరూ వెల్లడించలేదు. అయితే ఇన్నాళ్లకు ఆ విషయం గుట్టువీడింది. కేటీఆర్‌కు ఆ పేరెలా వచ్చిందో ఆయన స్వయంగా వెల్లడించారు. 

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో.. బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ యూనిట్ ప్రారంభోత్సవం కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అయితే ఇదే కార్యక్రమంలో తారక రామారావు పేరుపై బాలకృష్ణ, కేటీఆర్ మధ్య ఆసక్తికరమైన సంభాషణ చోటు చేసుకుంది. 1976 లోనే తన తండ్రి కేసీఆర్ ఆ పేరు పెట్టారని.. తనకు తారకరామారావు పేరు ఎలా వచ్చినా.. ఆ పేరును నిలబెట్టేలా నడుచుకుంటానని కేటీఆర్ చెప్పుకొచ్చారు. 

Similar News