విరసం నేత వరవరరావు అరెస్ట్

Update: 2018-11-18 05:12 GMT

భీమా కొరెగావ్‌ కేసు విచారణ భాగంగా విరసం నేత వరవరరావును పుణె పోలీసులు అరెస్టు చేశారు. సాయంత్రం హైదరాబాద్‌ వచ్చిన పుణె పోలీసులు వరవరరావును ఆయన నివాసంలో అరెస్టు చేసి సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు చేయించిన తర్వాత పుణె తరలించారు. అయితే వరవరరావు అరెస్టును విరసం నేతలు అడ్డుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో స్వల్ప తోపులాట జరిగింది. వరవర రావుని వారెంట్‌ లేకుండా అక్రమంగా అరెస్టు చేశారని విరసం నేతలు, కుటుంబసభ్యులు ఆరోపించారు. 

ప్రధాని మోడీపై హత్యకు కుట్ర చేశారనే ఆరోపణలతో వరవరరావు సహా ఐదుగురిపై పుణెలో కొద్ది నెలల కింద కేసు నమోదైంది. ఈ కేసుపై ప్రజా సంఘాల నేతలు సుప్రీంకోర్టును ఆదేశించడంతో  వరవరరావును హైదరాబాద్‌లో గృహనిర్భందంలో ఉంచాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశించింది. గృహనిర్భందానికి సంబంధించి వరవరరావు ఇటీవల హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. దీంతో వరవరరావును అదుపులోకి తీసుకున్న పూణే పోలీసులు ఆయన ఇంట్లో అరగంట పాటు ఇంట్లో సోదాలు నిర్వహించారు. తర్వాత  గాంధీ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించి పుణె తరలించారు. తమపై పెట్టిన కేసులు అక్రమమని వరవర రావు ఆరోపించారు. ఇలాంటి అక్రమ కేసు అమెరికాలో కూడా నమోదు కాలేదని ఆయన ఎద్దేవా చేశారు.
 

Similar News