సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర గురించి తెలుసా మీకు

Update: 2017-12-16 06:28 GMT

మార్గశిర శుద్దషష్టినే సుబ్రహ్మణ్య షష్ఠి, స్కందషష్ఠి అంటారు.  ఈ రోజు ఉపవాసం ఉండి, సుబ్రహ్మణుని ఆరాధించటం వల్ల సకల నాగదోషాలు పరిహరింపబడతాయని భక్తుల విశ్వాసం. సుబ్రహ్మణ్య ప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం  ప్రచారంలో ఉంది.  అలాగే సంప్రదాయబద్డంగా పాము మంత్రాలను సాధన చేసేవారు మరింత శ్రధ్ధగా ఉండి ఆ మంత్రాన్ని మరింతగా జపం చేస్తారు.

ఇక తమిళనాడులో ఇదే రోజు కావడి మొక్కు తీరుస్తారు.. షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి కావడిలో  పంచదారను, పాలనూ మోసుకొని వెళతారు. ఇది వారి  మొక్కును బట్టి, ఆర్ధిక స్తోమతను బట్టి ఉంటుంది.  ఈ విధంగా సమర్పించిన వారికి వంశవృధ్ది కలుగుతుందని నమ్మకం. ఈ  పండుగ తమిళనాడులో బాగా ప్రాచుర్యం పొందింది.
 

సుబ్రహ్మణ్య స్వామి జననం

కుమారస్వామి జననం గురించి పురాణాలలో పలు కధలు ఉన్నాయి.  శివపార్వతులు మన్మథ క్రీడలో ఉండగా తనను మించిన ప్రభావవంతుడు పుడతాడని ఇంద్రుడు భయపడి వారికి అంతరాయం కలిగించడానికి అగ్నిని నియమిస్తాడు. అగ్నిని చూసిన శివుడు పార్వతికి దూరం కాగా భూమిపై పడనున్న శివతేజాన్ని అగ్ని గ్రహించి దాన్ని భరించలేక గంగలో విడిచి పెడతాడు.. గంగ దాన్ని తీరంలోని రెలు పొదల్లో జారవిడుస్తుంది.  ఆ విధంగా శరవణంలో  జన్మించడం వల్ల శరవణుడయ్యాడు. కృత్తికలుగా పిలువబడే  ఆరుగురు ముని కన్యలు బదరికావనం తీసుకొని పోయి పెంచడం వల్ల కార్తికేయుడయ్యాడు.  అందుచేత కుమారస్వామి ఆలయాలకు వెళ్ళినప్పుడు  ముందుగా ఆరు ప్రదక్షణాలు చేయాలి.  ఇలా చేయడం వలన భక్తులకు ఉండే అనారోగ్యం, అప్పుల బాధలు తొలగిపోతాయి. ఆరు ప్రదక్షిణల అనంతరం స్వామిని స్తుతించి మరలా విడిగా మరొక సారి ప్రదక్షిణ చేయాలి. ఇలా చేసినట్లైతే నిరుద్యోగులకు ఉద్యోగలాభం, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.

Similar News