IT: స్టాక్స్ 'ఢమాల్': ఇన్వెస్టర్ల సొమ్ము ఆవిరి.. ఇన్ఫోసిస్, విప్రో భారీ పతనం! కారణాలు ఇవే..

ఐటీ షేర్లు కుప్పకూలాయి. ఇన్ఫోసిస్, విప్రో సహా ప్రధాన స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. ట్రంప్ హెచ్చరికలు, అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం ఐటీ రంగంపై ఎలా ఉందో ఈ కథనంలో చూడండి.

Update: 2026-01-05 14:13 GMT

భారత ఐటీ రంగానికి సోమవారం (జనవరి 5) 'బ్లాక్ డే'గా మారింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేజీలో నిఫ్టీ ఐటీ సూచీ (Nifty IT Index) 2 శాతం మేర పతనం కావడం మార్కెట్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ముఖ్యంగా లార్జ్ క్యాప్ ఐటీ కంపెనీలు బేర్ మార్కెట్ పట్టులోకి వెళ్లాయి.

పడిపోయిన ప్రధాన కంపెనీల షేర్లు:

  • ఇన్ఫోసిస్ (Infosys): 3.5% క్షీణత.
  • హెచ్‌సీఎల్ టెక్ (HCL Tech): దాదాపు 2% నష్టం.
  • విప్రో, టెక్ మహీంద్రా, పర్సిస్టెంట్: 2% వరకు పతనం.

ఐటీ పతనానికి 4 ప్రధాన కారణాలు:

1. బ్రోకరేజ్ సంస్థల ప్రతికూల నివేదికలు:

ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ HSBC, ఐటీ సెక్టార్‌పై తన అంచనాలను తగ్గించింది. ఐటీ కంపెనీల వృద్ధి ఇకపై రెండంకెల స్థాయిలో (10% పైన) ఉండదని, సింగిల్ డిజిట్‌కే పరిమితం కావచ్చని హెచ్చరించింది. మరోవైపు జెఫరీస్ (Jefferies) సంస్థ 2027 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి కేవలం 4.7 శాతానికే పరిమితం కావచ్చని అంచనా వేయడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

2. ట్రంప్ 'టారిఫ్' హెచ్చరికలు:

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై సుంకాలు (Tariffs) విధిస్తామని మళ్లీ హెచ్చరించడం ఐటీ రంగానికి శాపంగా మారింది. రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు తగ్గించకపోతే వాణిజ్యపరమైన చర్యలు తప్పవన్న సంకేతాలు, అమెరికాపై ఎక్కువగా ఆధారపడే ఐటీ కంపెనీలను భయపెడుతున్నాయి.

3. బలహీనపడ్డ రూపాయి:

అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ రూ. 90 స్థాయిని దాటేసింది. సాధారణంగా రూపాయి విలువ తగ్గితే ఐటీ కంపెనీలకు లాభమని భావిస్తారు, కానీ వాణిజ్య యుద్ధ మేఘాల వల్ల ఏర్పడిన తీవ్ర ఒత్తిడి రూపాయిని మరింత బలహీనపరుస్తోంది. ఇది దీర్ఘకాలంలో భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే ఆందోళన పెరిగింది.

4. వెనిజులా పరిణామాలు - భౌగోళిక ఉద్రిక్తతలు:

వెనిజులా అధ్యక్షుడు మాదురోను అమెరికా అదుపులోకి తీసుకోవడం అంతర్జాతీయంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. దీనివల్ల గ్లోబల్ ట్రేడ్ అస్థిరంగా మారింది. ఈ ప్రభావం టెక్ మరియు ఇంధన రంగాలపై నేరుగా కనిపిస్తోంది.

ముందున్నది ముసళ్ల పండగ?

వచ్చే వారం నుండి ఐటీ కంపెనీల మూడో త్రైమాసిక (Q3) ఫలితాలు వెల్లడి కానున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరానికి కంపెనీలు ఇచ్చే 'గైడెన్స్' (రాబడి అంచనాలు) ఎలా ఉండబోతున్నాయన్న దానిపైనే స్టాక్స్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అప్పటి వరకు రిటైల్ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News