Gold Rate Today: పసిడి, వెండి పరుగులు.. డిసెంబర్ 29వ తేదీ సోమవారం ధరలు ఇవే..!!
Gold Rate Today: పసిడి, వెండి పరుగులు.. డిసెంబర్ 29వ తేదీ సోమవారం ధరలు ఇవే..!!
Gold Rate Today: నేడు డిసెంబర్ 29వ తేదీ సోమవారం దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి సంచలనం సృష్టించాయి. బంగారం ధరలు వరుసగా కొత్త రికార్డులను సృష్టిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,135గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,147 వద్ద స్థిరపడింది. మరోవైపు వెండి ధరలు మరింత దూకుడుగా కదిలాయి. ఒక కిలో వెండి ధర రూ.2,53,922కి చేరి చరిత్రలోనే అత్యంత గరిష్ట స్థాయిని తాకింది.
గత వారం రోజులుగా బంగారం ధరలను పరిశీలిస్తే, రోజూ కొత్త ఆల్‌టైం రికార్డులు నమోదవుతున్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే నేడు కూడా బంగారం ధరల్లో గణనీయమైన పెరుగుదల కనిపించింది. దీనికి ప్రధాన కారణాలు అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలేనని నిపుణులు చెబుతున్నారు.
అంతర్జాతీయంగా పసిడి ధరలు భారీగా ఎగబాకుతున్నాయి. అమెరికాలో గత శుక్రవారం ఒక ఔన్స్ (సుమారు 31.1 గ్రాములు) బంగారం ధర 4,530 డాలర్ల వద్ద ఆల్‌టైం హైను నమోదు చేసింది. ఈ అంశాన్ని రాయిటర్స్ నివేదికలో ప్రస్తావించింది. అంతర్జాతీయ మార్కెట్లో వచ్చిన ఈ పెరుగుదల ప్రభావం నేరుగా భారత మార్కెట్‌పై పడింది. ఫలితంగా దేశీయంగా కూడా బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి.
ఇదే సమయంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై ఉన్న అంచనాలు కూడా పసిడి ధరలకు బలాన్ని ఇస్తున్నాయి. 2026లో కూడా వడ్డీ రేట్ల కోత ఉండొచ్చన్న వార్తలు మార్కెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నియమించబోయే కొత్త ఫెడ్ చైర్మన్ వడ్డీ రేట్ల విషయంలో సాఫ్ట్ దృక్పథం కలిగి ఉంటారనే అంచనాలు కూడా బంగారం ధరలకు మద్దతు ఇస్తున్నాయి.
మరో కీలక కారణం అమెరికా డాలర్ విలువ పతనం. 2020 సంవత్సరంలో డాలర్ ఇండెక్స్ దాదాపు 9 శాతం మేర క్షీణించింది. 2017 తర్వాత ఇదే అతిపెద్ద పతనంగా మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. డాలర్ బలహీనపడటంతో బంగారం ఇతర దేశాలకు చౌకగా కనిపిస్తుంది. దీంతో అనేక దేశాలు పెద్ద ఎత్తున బంగారం కొనుగోళ్లు ప్రారంభిస్తాయి. ఇది డిమాండ్‌ను పెంచి ధరలను మరింత పైకి తీసుకెళ్తుంది.
అమెరికా ఆర్థిక వ్యవస్థలో మందగమనం సంకేతాలు కూడా బంగారానికి అనుకూలంగా మారాయి. ఉద్యోగావకాశాలు తగ్గడం, వ్యాపార వృద్ధి మందగిస్తోందన్న అంచనాలతో ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ల నుంచి బయటకు వచ్చి సురక్షిత పెట్టుబడులైన బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు.
ఇదే సమయంలో వెండి ధరలు కూడా అంచనాలను మించి దూసుకుపోతున్నాయి. అమెరికా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడిదారులు నష్టాలు ఎదుర్కొనడం, ప్రపంచవ్యాప్తంగా మెటల్ మార్కెట్‌లో బలమైన డిమాండ్ ఉండటంతో వెండి ధరలు ఆల్‌టైం హైను నమోదు చేశాయి. కేజీ వెండి ధర రూ.2.50 లక్షలు దాటడం దేశీయ మార్కెట్ చరిత్రలోనే ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు.