Bharat Brand : అమెరికాలో మార్మోగిపోతున్న భారత్ పేరు.. గంటకు 80 కోట్ల విలువైన ఎగుమతులు
India's exports to US rising: అమెరికాలో డోనల్డ్ ట్రంప్ పరిపాలన మొదలైంది. ఆయన అధికారంలోకి రావడానికంటే ముందు నుండే బ్రిక్స్ దేశాలను ట్రంప్ సుంకం పేరుతో బెదిరిస్తున్నారు. బ్రిక్స్ సభ్య దేశాలకు 100 శాతం సుంకం విధిస్తామని ట్రంప్ బెదిరించారు. అయినప్పటికీ, భారతీయ ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి అవడం మాత్రం ఆగలేదు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో భారత్ ప్రతి గంటకు దాదాపు రూ.80 కోట్ల విలువైన వస్తువులను అమెరికాకు ఎగుమతి చేసింది. తాజాగా ప్రభుత్వమే ఈ లెక్కలను బహిర్గతం చేసింది. అయితే, జనవరి నెల డేటా మాత్రం ప్రస్తుతానికి అందుబాటులో లేదు. జనవరి నెల సమాచారం వచ్చే నెలలో వస్తుంది. ఏప్రిల్ 2024 నుండి డిసెంబర్ 2024 వరకు భారత్ నుండి అమెరికాకు జరిగిన ఎగుమతి గణాంకాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో (ఏప్రిల్-డిసెంబర్) అమెరికాకు భారత్ నుంచి వస్తువుల ఎగుమతులు 5.57 శాతం పెరిగి 59.93 బిలియన్ డాలర్లు లేదా రూ.5.2 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దీని అర్థం భారత్ ప్రతి గంటకు అమెరికాకు రూ. 80 కోట్ల విలువైన వస్తువులను ఎగుమతి చేస్తోందని ఈ గణాంకాలు చెబుతున్నాయి.
అమెరికన్ మార్కెట్లో భారతీయ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుండటమే ఈ ఎగుమతులు పెరగడానికి కారణం అయింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం డిసెంబర్‌లో అమెరికాకు భారతదేశం ఎగుమతులు 8.49 శాతం పెరిగి 7 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో అమెరికా నుండి భారతదేశ దిగుమతులు 1.91 శాతం పెరిగి 33.4 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. డిసెంబర్‌లో ఇది 9.88 శాతం పెరిగి 3.77 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
రాబోయే నెలల్లో రెండు దేశాల మధ్య వాణిజ్యం మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 93.4 బిలియన్ డాలర్లుగా ఉంది. అదే సమయంలో భారత్, చైనా మధ్య వాణిజ్యం 94.6 బిలియన్ డాలర్లుగా ఉంది. ఒకవేళ భవిష్యత్‌లో అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం తలెత్తితే.. భారత ఎగుమతిదారులకు ఎగుమతి వ్యాపారంలో మరిన్ని అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు భావిస్తున్నారు.