DMart: డీమార్ట్ ధరలు తక్కువ వెనక సీక్రెట్ ఇదే.. మిమ్మల్ని మోసం చేస్తున్నట్లేనా..?
DMart: డీమార్ట్ ధరలు తక్కువ వెనక సీక్రెట్ ఇదే.. మిమ్మల్ని మోసం చేస్తున్నట్లేనా..?
DMart: భారతదేశంలో మధ్యతరగతి, తక్కువ ఆదాయ కుటుంబాల షాపింగ్ జాబితాలో ముందుగా గుర్తుకు వచ్చే పేరు డీమార్ట్ (DMart). బయట మార్కెట్‌లో ఒక వస్తువు రూ.149కి అమ్ముతున్నప్పుడు, అదే వస్తువు డీమార్ట్‌లో రూ.99కే దొరకడం చూసి చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత తక్కువ ధరలు ఎలా సాధ్యమవుతున్నాయో తెలియక “ఏదైనా మాయ ఉందేమో” అని అనుకుంటారు. కానీ నిజానికి డీమార్ట్ వెనుక ఎలాంటి మంత్రాలు లేవు. క్రమశిక్షణతో అమలు చేసే స్పష్టమైన వ్యాపార వ్యూహాలే దీనికి అసలు బలం.
డీమార్ట్ ప్రధానంగా అనుసరించే విధానం “తక్కువ లాభం – ఎక్కువ అమ్మకాలు”. ఒక్కో వస్తువుపై అధిక లాభం ఆశించకుండా, చాలా స్వల్ప లాభంతో ఎక్కువ మంది వినియోగదారులకు విక్రయించడం దీని వ్యాపార సూత్రం. ఉదాహరణకు ఇతర దుకాణాలు ఒక బిస్కెట్ ప్యాకెట్‌పై రూ.10 లాభం పొందాలని చూస్తే, డీమార్ట్ అదే వస్తువును కేవలం రూ.2 లాభంతో విక్రయిస్తుంది. తక్కువ ధరల కారణంగా కస్టమర్లు భారీ సంఖ్యలో స్టోర్లకు వస్తారు. ఫలితంగా ఒకే వస్తువు కాదు, అనేక రకాల ఉత్పత్తుల అమ్మకాలు పెరిగి మొత్తం టర్నోవర్ భారీగా పెరుగుతుంది. చివరికి సంస్థకు పెద్ద లాభాలే వస్తాయి.
ఇంకొక కీలక అంశం సరఫరాదారులతో వ్యవహరించే విధానం. చాలా రిటైల్ సంస్థలు సరఫరా చేసిన వస్తువుల బిల్లులను చెల్లించడానికి నెలలు పడేస్తాయి. కానీ డీమార్ట్ మాత్రం విక్రేతలకు త్వరగా చెల్లింపులు చేస్తుంది. సమయానికి డబ్బులు రావడం వల్ల సరఫరాదారులు డీమార్ట్‌కు తక్కువ ధరలకు సరుకులు ఇవ్వడానికి ఆసక్తి చూపుతారు. అదనంగా, ఒకేసారి భారీగా కొనుగోళ్లు చేయడం వల్ల కంపెనీల నుంచి మరిన్ని డిస్కౌంట్లు పొందగలుగుతుంది.
ఖర్చులను కట్టడి చేయడం డీమార్ట్ విజయానికి మరో ముఖ్య కారణం. ఈ సంస్థ అనవసర ఆర్భాటాలకు దూరంగా ఉంటుంది. ఎక్కువగా అద్దె భవనాలపై ఆధారపడకుండా, సొంత స్థలాల్లోనే స్టోర్లను నిర్మిస్తుంది. దీని వల్ల ప్రతినెల అద్దె భారం తగ్గుతుంది. ఇతర సూపర్ మార్కెట్లలా ఖరీదైన డెకరేషన్, ఆకర్షణీయమైన లైటింగ్, మ్యూజిక్ వంటి వాటిపై ఖర్చు చేయదు. ఇలా ఆదా చేసిన మొత్తాన్ని నేరుగా కస్టమర్లకు డిస్కౌంట్ల రూపంలో అందిస్తుంది.
డీమార్ట్ ప్రధానంగా నిత్యావసర వస్తువులపైనే ఎక్కువ దృష్టి పెడుతుంది. కిరాణా సామగ్రి, పప్పులు, నూనెలు, సబ్బులు, డిటర్జెంట్లు వంటి రోజూ అవసరమయ్యే వస్తువులు త్వరగా అమ్ముడవుతాయి. వీటిని “ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్”గా పిలుస్తారు. ఈ విధానం వల్ల స్టాక్ ఎక్కువకాలం గోడౌన్లలో నిల్వ ఉండదు. పెట్టుబడి వేగంగా తిరిగి వస్తుంది.
ఈ మొత్తం వ్యూహానికి వెనుక డీమార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమాని ఆలోచనా విధానం కీలక పాత్ర పోషించింది. స్టాక్ మార్కెట్‌లో సంపాదించిన అనుభవాన్ని రిటైల్ రంగంలో సమర్థంగా ఉపయోగించారు. స్థిరమైన వృద్ధిపై దృష్టి పెట్టుతూ, ఖర్చులను నియంత్రిస్తూ డీమార్ట్‌ను దేశంలోనే అత్యంత విశ్వసనీయమైన రిటైల్ బ్రాండ్‌గా తీర్చిదిద్దారు.