Budget 2026: పెళ్లైన వారికి బంపర్ ఆఫర్! భార్యాభర్తలు కలిసి ట్యాక్స్ కడితే రూ. 8 లక్షల వరకు సున్నా పన్ను?
బడ్జెట్ 2026: వివాహిత జంటలకు జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ విధానాన్ని ICAI ప్రతిపాదించింది. దీనివల్ల రూ. 8 లక్షల వరకు ఆదాయం ఉన్న దంపతులు పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
భారత ఆదాయపు పన్ను వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయా? అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. వివాహిత జంటలకు 'ఉమ్మడి పన్ను విధానాన్ని' (Joint Tax Filing) ప్రవేశపెట్టాలని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు కీలక సిఫార్సు చేసింది. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలకు భారీగా పన్ను ఊరట లభించే అవకాశం ఉంది.
ఉమ్మడి పన్ను విధానం అంటే ఏమిటి?
ప్రస్తుతం మన దేశంలో భార్య, భర్త ఇద్దరూ సంపాదిస్తున్నా ఎవరికి వారు విడివిడిగా ఆదాయపు పన్ను (Individual Filing) చెల్లించాలి. కానీ ICAI ప్రతిపాదన ప్రకారం.. భార్యాభర్తలు ఇద్దరూ కలిపి ఉమ్మడిగా పన్ను దాఖలు చేసే వెసులుబాటు కల్పించాలి.
దీని వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు:
- మినహాయింపు పరిమితి రెట్టింపు: ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో రూ. 4 లక్షల వరకు ప్రాథమిక మినహాయింపు ఉంది. జంటలు కలిసి ఫైల్ చేస్తే ఈ పరిమితిని రూ. 8 లక్షలకు పెంచాలని ICAI కోరింది. అంటే రూ. 8 లక్షల ఆదాయం వరకు ఒక్క రూపాయి కూడా పన్ను కట్టక్కర్లేదు.
- ఒకే వ్యక్తి సంపాదన ఉన్న కుటుంబాలకు లాభం: ఇంట్లో ఒకరే సంపాదించి, మరొకరు ఆధారపడి ఉన్న కుటుంబాలకు ఇది వరం కానుంది. పన్ను భారం ఆ కుటుంబంపై తగ్గుతుంది.
- పన్ను స్లాబ్‌ల విస్తరణ: గరిష్ట పన్ను రేటు (30 శాతం) వర్తించే పరిమితిని కూడా పెంచాలని సిఫార్సు చేశారు. ఉమ్మడి ఆదాయం రూ. 48 లక్షలు దాటితేనే 30% పన్ను వేయాలని సూచించారు.
ప్రతిపాదిత కొత్త పన్ను స్లాబ్‌లు (వ్యక్తిగత):
బడ్జెట్ 2026 కోసం ICAI సూచించిన వ్యక్తిగత పన్ను నిర్మాణం ఇలా ఉంది:
నిపుణులు ఏమంటున్నారు?
స్టెల్లార్ ఇన్నోవేషన్స్ వైస్ ప్రెసిడెంట్ కార్తీక్ నారాయణ్ మాట్లాడుతూ.. ఈ విధానం కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. "ప్రస్తుతం గృహ ఖర్చులను ఉమ్మడిగా భరిస్తున్నారు, కాబట్టి పన్నును కూడా ఉమ్మడిగా ఫైల్ చేసే అవకాశం ఇవ్వడం సమంజసం" అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది డిజిటల్ పద్ధతిలో పన్ను చెల్లింపులను మరింత సులభతరం చేస్తుందని తెలిపారు.