EPFO: ప్రైవేటు ఉద్యోగులకు శుభవార్త...త్వరలోనే UPI యాప్ ద్వారా PF డబ్బులు విత్ డ్రా చేసుకునే అవకాశం..!!

EPFO: ప్రైవేటు ఉద్యోగులకు శుభవార్త...త్వరలోనే UPI యాప్ ద్వారా PF డబ్బులు విత్ డ్రా చేసుకునే అవకాశం..!!

Update: 2026-01-17 01:46 GMT

EPFO: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఉద్యోగుల కోసం కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా పీఎఫ్ ఉపసంహరణ ప్రక్రియను మరింత సులభం, వేగవంతం చేసే దిశగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే తీసుకున్న విధానపరమైన నిర్ణయాలకు అనుగుణంగా కొత్త వ్యవస్థను అమల్లోకి తీసుకురావడానికి కార్యాచరణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఇకపై పీఎఫ్ డబ్బులను యూపీఐ (UPI) ద్వారా నేరుగా ఉపసంహరించుకునే అవకాశం కల్పించనుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఏప్రిల్ నెల నుంచి ఈ సదుపాయం ఈపీఎఫ్ఓ సభ్యులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఎకనామిక్ టైమ్స్ పత్రిక తన కథనంలో వెల్లడించింది.

కొత్త విధానం అమలులోకి వస్తే, ఈపీఎఫ్ఓ సభ్యులు తమ పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులను యూపీఐ ఆధారిత చెల్లింపు వ్యవస్థ ద్వారా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం యూపీఐ పిన్‌ను ఉపయోగించి లావాదేవీ పూర్తి చేయాల్సి ఉంటుంది. విత్‌డ్రా పూర్తైన వెంటనే, మిగిలిన ఈపీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు సభ్యుడి ఖాతాలో స్పష్టంగా కనిపిస్తాయి. యూపీఐ ద్వారా ఉపసంహరించిన మొత్తం నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ఆ తరువాత అవసరాన్ని బట్టి ఏటీఎంల ద్వారా నగదు తీసుకోవడం గానీ, ఆన్లైన్ లావాదేవీలకు వినియోగించడం గానీ చేయవచ్చు.

ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం, పీఎఫ్ నుంచి డబ్బులు తీసుకోవాలంటే ముందుగా క్లెయిమ్ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. నామినేషన్, డాక్యుమెంట్ల పరిశీలన వంటి ప్రక్రియల వల్ల దీనికి కొంత సమయం పట్టేది. అయితే ఆటో సెటిల్‌మెంట్ విధానంలో క్లెయిమ్ చేసిన మూడు రోజుల్లోనే డబ్బులు జమ అవుతున్నాయి. గతంలో ఆటో సెటిల్‌మెంట్ ద్వారా కేవలం రూ.1 లక్ష వరకు మాత్రమే ఉపసంహరణకు అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ పరిమితిని రూ.5 లక్షలకు పెంచారు. ఈ మార్పుతో సుమారు 8 కోట్ల మంది ఈపీఎఫ్ఓ సభ్యులు ప్రయోజనం పొందే అవకాశముంది. అయితే ఈ సదుపాయం వైద్య చికిత్స, విద్య, వివాహం, గృహ నిర్మాణం వంటి నిర్దిష్ట అవసరాలకే పరిమితం.

ఇప్పటికే ప్రతి సంవత్సరం సగటున ఐదు కోట్ల వరకు పీఎఫ్ విత్‌డ్రా దరఖాస్తులు ఈపీఎఫ్ఓకు చేరుతున్నాయి. యూపీఐ ఆధారిత ఉపసంహరణ విధానం అందుబాటులోకి వస్తే, కార్యాలయాలపై ఉన్న పనిభారం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. అదే సమయంలో ఉద్యోగులకు వేగంగా, సులభంగా సేవలు అందుతాయి.

కొత్త నిబంధనల ప్రకారం, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో 100 శాతం వరకు పీఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకునే అవకాశం ఉంది. అయితే సభ్యుడి ఖాతాలో కనీసం 25 శాతం బ్యాలెన్స్ ఉంచాల్సిన నిబంధన ఉంటుంది. మొత్తం 13 రకాల పరిస్థితుల్లో మాత్రమే ఉపసంహరణకు అనుమతి ఉంటుంది. వీటిని అత్యవసర అవసరాలు, గృహ సంబంధిత అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు అనే మూడు విభాగాలుగా ఈపీఎఫ్ఓ విభజించింది. ఈ మార్పులతో పీఎఫ్ నిర్వహణ మరింత ఆధునికంగా, వినియోగదారులకు అనుకూలంగా మారనుంది.

Tags:    

Similar News