Budget 2026: షేర్ల ఇన్వెస్టర్లకు ఊరట లభిస్తుందా? 'ఎల్‌టీసీజీ' పన్ను తగ్గించాలని కేంద్రానికి మార్కెట్ వర్గాల విన్నపం!

కేంద్ర బడ్జెట్ 2026పై క్యాపిటల్ మార్కెట్ వర్గాల ఆశలు. LTCG పన్ను మినహాయింపు పరిమితిని రూ. 2 లక్షలకు పెంచాలని, పన్ను రేట్లు తగ్గించాలని నిర్మలా సీతారామన్‌కు విన్నపం.

Update: 2026-01-19 07:10 GMT

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే రాబోయే బడ్జెట్‌పై క్యాపిటల్ మార్కెట్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే రిటైల్ మదుపరులను ప్రోత్సహించేందుకు పన్ను రాయితీలు ఇవ్వాలని మార్కెట్ నిపుణులు కోరుతున్నారు.

రూ. 2 లక్షల వరకు పన్ను మినహాయింపు కావాలి!

ప్రస్తుతం షేర్ల అమ్మకం ద్వారా వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాల (LTCG)పై ఏటా రూ. 1.25 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంది. అయితే, మారుతున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ పరిమితిని రూ. 2 లక్షలకు పెంచాలని జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి సంస్థలు ప్రభుత్వానికి సూచించాయి.

పన్ను రేట్ల తగ్గింపు ప్రతిపాదనలు:

LTCG: ప్రస్తుతం 12.5 శాతంగా ఉన్న దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును 10 శాతానికి తగ్గించాలి.

STCG: ప్రస్తుతం 20 శాతంగా ఉన్న స్వల్పకాలిక మూలధన లాభాల పన్నును కూడా 10 శాతానికి కుదించాలి.

మార్కెట్ వర్గాల ఇతర కీలక డిమాండ్లు ఇవే:

STT భారం వద్దు: షేర్ల లావాదేవీల పన్ను (Securities Transaction Tax)ను ఇకపై ఏమాత్రం పెంచకూడదు.

బంగారం, వెండి: పసిడి, వెండిపై పన్నుల భారం పెంచకుండా యథాతథంగా ఉంచాలి.

నష్టాల భర్తీ: ఒక ఆస్తి (ఉదాహరణకు రియల్టీ) అమ్మినప్పుడు వచ్చిన నష్టాన్ని, మరో ఆస్తి (ఉదాహరణకు షేర్లు) లాభం నుంచి భర్తీ చేసుకునే అవకాశం కల్పించాలి.

కాలపరిమితి మార్పు: ఈక్విటీ, రియల్టీ, డెట్, పసిడి.. ఇలా ఏ విభాగంలోనైనా దీర్ఘకాలిక లాభాలను లెక్కించడానికి 12 నెలల కాలపరిమితిని ప్రామాణికంగా తీసుకోవాలి.

బైబ్యాక్ పన్ను: షేర్ల బైబ్యాక్‌పై వచ్చే లాభాలపై మాత్రమే పన్ను విధించేలా నిబంధనలు ఉండాలి.

ఈ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే, స్టాక్ మార్కెట్‌లోకి కొత్త ఇన్వెస్టర్లు పెరగడంతో పాటు రిటైల్ మదుపరులకు భారీ ఊరట లభిస్తుందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Tags:    

Similar News