Budget 2026: మధ్యతరగతికి బిగ్ రిలీఫ్? ఇంటి కొనుగోలుపై భారీ రాయితీలు

Budget 2026: బడ్జెట్ 2026లో మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాలు వచ్చే అవకాశముంది. హోమ్ లోన్ వడ్డీపై పన్ను రాయితీలు, సరసమైన గృహాలకు ప్రోత్సాహం కోరుతున్నారు.

Update: 2026-01-19 05:20 GMT

Budget 2026: మధ్యతరగతికి బిగ్ రిలీఫ్? ఇంటి కొనుగోలుపై భారీ రాయితీలు

Budget 2026:  ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ 2026పై స్థిరాస్తి (రియల్ ఎస్టేట్) రంగం భారీ ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే గృహాల కొనుగోలుకు ఊతమిచ్చే విధంగా పన్ను రాయితీలు, విధానపరమైన ప్రోత్సాహకాలు కల్పించాలని ఈ రంగ నిపుణులు కోరుతున్నారు.

‘అందరికీ ఇల్లు’ లక్ష్యం ఇప్పటికీ చాలామందికి కలగానే మిగిలిపోయిందని, ఈ పరిస్థితి మారాలంటే రాబోయే బడ్జెట్ కీలక పాత్ర పోషించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాధారణ కుటుంబాలు సొంతింటి కలను సాకారం చేసుకునేలా స్పష్టమైన విధానాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీలు సూచిస్తున్నాయి.

బడ్జెట్ 2026 అన్ని రంగాల్లో సమగ్ర ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించేలా ఉండాలని, అదే సమయంలో స్థిరాస్తి రంగానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు అంటున్నారు. సరసమైన గృహాల ధరల పరిమితిని పెంచి, పట్టణాల్లో ప్రస్తుత ధరల పరిస్థితులకు అనుగుణంగా అర్హత ప్రమాణాలను సవరించాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే ఈ తరహా ఇళ్ల నిర్మాణం, విక్రయాలు రెండింటికీ ఊతం లభిస్తుందని పేర్కొంటున్నారు.

మౌలిక సదుపాయాల విస్తరణ, గృహాల సరఫరా పెంపు ద్వారా రియల్ ఎస్టేట్ రంగంలో దీర్ఘకాలిక వృద్ధి సాధ్యమని విశ్లేషిస్తున్నారు. అలాగే సామాన్య పెట్టుబడిదారులకు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్టులు (REITs), ఎస్ఎం రీట్స్ (SM REITs) మరింత ఆకర్షణీయంగా మారేందుకు విధానపరమైన మద్దతు అవసరమని సూచిస్తున్నారు. పర్యావరణ హిత గృహ నిర్మాణానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.

మధ్యతరగతి గృహ కొనుగోలుదారులపై భారం తగ్గించేందుకు హోమ్ లోన్ వడ్డీపై ప్రస్తుతం ఉన్న రూ.2 లక్షల పన్ను మినహాయింపును కనీసం రూ.5 లక్షలకు పెంచాలని నిపుణులు కోరుతున్నారు. ప్రస్తుతం ఎక్కువగా లగ్జరీ గృహాలపైనే ప్రాజెక్టులు దృష్టి సారిస్తున్న నేపథ్యంలో, సరసమైన ఇళ్ల కొరత పెరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఫిబ్రవరి 1 ఆదివారం అయినప్పటికీ, ఆ రోజే పార్లమెంటులో బడ్జెట్‌ను యథావిధిగా ప్రవేశపెడతామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అదే రోజు స్టాక్ మార్కెట్లు కూడా పనిచేస్తాయని అధికారికంగా ప్రకటించింది.

Tags:    

Similar News