AP News: విజయవాడలో విషాదం.. చపాతీ గొంతులో ఇరుక్కుని వృద్ధుడు మృతి
AP News: విజయవాడ చిట్టినగర్ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. చపాతీ ముక్క గొంతులో ఇరుక్కుని ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయారు.
AP News: విజయవాడలో విషాదం.. చపాతీ గొంతులో ఇరుక్కుని వృద్ధుడు మృతి
AP News: విజయవాడ చిట్టినగర్ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. చపాతీ ముక్క గొంతులో ఇరుక్కుని ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కేఎల్ రావు నగర్ ఆరో లైన్‌లో శుక్రవారం రాత్రి జరిగింది.
స్థానికుడైన తోట ప్రసాద్ (80) రాత్రి 8 గంటల సమయంలో భోజనం చేస్తుండగా అకస్మాత్తుగా చపాతీ ముక్క గొంతులో చిక్కుకుంది. దీంతో ఆయనకు ఊపిరి ఆడక తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. కిందపడిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే గమనించి నీళ్లు తాగించినా ఉపయోగం లేకపోయింది. 108కు సమాచారం ఇచ్చినా అంబులెన్స్ వచ్చేలోగానే ఆయన మృతి చెందినట్టు తెలిసింది.
ప్రసాద్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ పెద్ద అకస్మాత్తుగా మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
గతంలోనూ ఇలాంటి ఘటనలు
ఇలాంటి ఘటనలు ఇటీవల పలుచోట్ల చోటుచేసుకున్నాయి. గత నవంబర్‌లో హైదరాబాద్ సికింద్రాబాద్‌లో విరాన్ జైన్ అనే ఆరో తరగతి విద్యార్థి చపాతీ రోల్ గొంతులో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. లంచ్ సమయంలో తింటుండగా శ్వాస ఆడక కుప్పకూలడంతో ఆస్పత్రికి తరలించేలోగానే మృతి చెందాడు.
ఇడ్లీ, దోసె, చికెన్ ముక్కలు వంటి ఆహారం కూడా గొంతులో ఇరుక్కుని ప్రాణహాని కలిగించిన ఘటనలు ఇటీవల పెరుగుతున్నాయి.
వైద్యుల హెచ్చరిక
వైద్యుల ప్రకారం ఆహారం మింగే సమయంలో శ్వాసనాళం సహజంగా మూసుకుపోతుంది. అయితే వేగంగా తినడం, ఒకేసారి ఎక్కువగా మింగడం, తింటూ మాట్లాడటం వంటి అలవాట్ల వల్ల శ్వాసనాళం పూర్తిగా మూసుకోకపోవచ్చని చెబుతున్నారు. అప్పుడు ఆహారం శ్వాసనాళంలోకి వెళ్లి ఊపిరాడకపోవడం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు.
ఈ పరిస్థితిలో శరీరానికి ఆక్సిజన్ అందకపోతే అది ప్రాణాపాయానికి దారితీస్తుందని, అందుకే భోజనం సమయంలో నెమ్మదిగా, జాగ్రత్తగా తినాలని సూచిస్తున్నారు.
జాగ్రత్తలు
♦ తింటూ మాట్లాడకండి
♦ ఒకేసారి ఎక్కువగా మింగకండి
♦ ఆహారాన్ని బాగా నమిలి తినండి
♦ పిల్లలు, వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి
ఈ చిన్న జాగ్రత్తలు పెద్ద ప్రమాదాలను నివారించగలవని వైద్యులు చెబుతున్నారు.