Ganesh Chaturthi: వినాయక వ్రతం ఎప్పుడు ఆచరించాలి? నవరాత్రులపై గ్రహణ ప్రభావం ఎంత?
ఊరు వాడా కొలువై, భక్తులందరికీ ఆశీర్వాదాలు అందించేందుకు బొజ్జ గణపయ్య మండపాల్లోకి విచ్చేస్తున్నాడు. దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకునే వినాయక చవితి ఈసారి ఆగస్టు 27న నిర్వహించబడనుంది. బుధవారం రోజున సిధ్ధి, బుద్ధి ప్రసాదించే విఘ్నేశ్వరుడి వ్రతం జరగడం విశేషం. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటలోపే పూజలు చేయడం ఉత్తమం.

వినాయకుని పూజ విశిష్టత
గణనాయకుడు మన పూర్వ జన్మ పాప పుణ్యాలకు తగ్గట్టు నడిపించే దైవం. వినాయక చవితి రోజున ఒక్క రోజు పూజ చేసినా పాపాలు తొలగి, విఘ్నాలు దూరమై శుభఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఏ శుభకార్యం, వ్రతమూ విఘ్నేశ్వరుడి పూజ లేకుండా ఆచరించరాదని ధర్మశాస్త్రం పేర్కొంటోంది.
మట్టి విగ్రహం ప్రాధాన్యం
చెరువులు, నదుల మట్టితో తయారు చేసిన గణేశుడిని మాత్రమే పూజించాలి. సృష్టి మొత్తం ఒకే పదార్థం నుంచి పుట్టి, మళ్లీ అదే పదార్థంలో లయమవుతుందనే సూత్రాన్ని సూచిస్తూ మట్టి విగ్రహాన్ని శాస్త్రం ప్రాముఖ్యంగా చెబుతోంది. ఇది జీవన గూఢార్థాన్ని తెలియజేస్తుంది.
గ్రహణ ప్రభావం
గణేశ నవరాత్రులను విఘ్నేశ్వర వ్రతం అనంతరం ఆచరించడం ఆచారం. అయితే ఈ సంవత్సరం సెప్టెంబర్ 7న రాహుగ్రస్త చంద్రగ్రహణం ఉండటంతో, దానికి ముందే గణేశ నిమజ్జనం పూర్తి చేయడం ఉత్తమం.
ఏకవింశతి పత్రి పూజ
వినాయక పూజలో 21 రకాల పత్రి పూజ చాలా ముఖ్యమైనది. ఈ పత్రాలన్నీ ఔషధ గుణాలతో నిండివుండటంతో, భాద్రపదమాసంలో ఇంట్లో పూజలు చేయడం ద్వారా ఆరోగ్య రక్షణ కూడా కలుగుతుందని ఆయుర్వేదం చెబుతోంది.
వినాయక నిమజ్జనం
వ్రతం అనంతరం జరిగే నిమజ్జనం అత్యంత కీలకమైనది. ఎంత భక్తితో పూజ చేస్తామో, అంతకంటే ఎక్కువ శ్రద్ధతో నిమజ్జనం చేయాలి. ఈ రోజు ఉపవాసం చేయడం శ్రేయస్కరం. సముద్రం, నది, చెరువు లేదా ఇంట్లో పాత్రలో భక్తిశ్రద్ధలతో గణేశుడిని నిమజ్జనం చేయాలి. చెప్పులు ధరించకూడదు. వ్రతం పూర్తయ్యాక గణపతి కథలు వినడం, అక్షింతలు తలపై వేసుకోవడం, ముఖ్యంగా శమంతకోపాఖ్యానం పఠించడం శ్రేయస్కరం.
వినాయక వ్రతాన్ని నిష్ఠగా ఆచరించిన భక్తులకు గణపయ్య అనుగ్రహం లభించి అన్ని విఘ్నాలు తొలగిపోతాయి.