Dhanurmasam 2025: ఈ సమయంలో ఇవి చేయకూడదు.. శుభకార్యాలకు ఎందుకు బ్రేక్? ఎప్పటి వరకు అంటే…

డిసెంబర్‌ 16, 2025 నుంచి ధనుర్మాసం ప్రారంభమైంది. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించడంతో ఈ మాసం మొదలవుతుందని జ్యోతిష్య పండితులు చెబుతారు.

Update: 2025-12-24 09:53 GMT

Dhanurmasam 2025: ఈ సమయంలో ఇవి చేయకూడదు.. శుభకార్యాలకు ఎందుకు బ్రేక్? ఎప్పటి వరకు అంటే…

డిసెంబర్‌ 16, 2025 నుంచి ధనుర్మాసం ప్రారంభమైంది. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించడంతో ఈ మాసం మొదలవుతుందని జ్యోతిష్య పండితులు చెబుతారు. 2026 జనవరి 14న మకర సంక్రాంతితో ధనుర్మాసం ముగుస్తుంది. ఈ నెల రోజులను పండుగల మాసంగా కూడా పిలుస్తారు. అయితే ఇదే సమయంలో శుభకార్యాలకు విరామం ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. దానికి కారణాలేంటి? ఎప్పటి వరకు శుభకార్యాలు చేయరంటే… ఇప్పుడు తెలుసుకుందాం.

ధనుర్మాసం అనేది దక్షిణాయణ పుణ్యకాలం ముగిసి, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభానికి మధ్య వచ్చే పవిత్ర కాలం. ఈ మాసం మొత్తం శ్రీమహావిష్ణు ఆరాధనకు అత్యంత విశిష్టమైనదిగా భావిస్తారు. ముఖ్యంగా ద్రావిడ సంప్రదాయంలో ఆండాళ్‌ అమ్మవారి పూజ, తిరుప్పావై పఠనం, గోదాదేవి కళ్యాణం వంటి ఆచారాలు ఈ కాలంలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. విష్ణు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతిరోజూ సుప్రభాతానికి బదులు తిరుప్పావై పఠనం చేస్తారు. సహస్రనామ అర్చనలో తులసి బదులు బిల్వ పత్రాలతో పూజ చేయడం కూడా ఆనవాయితీ.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ధనుర్మాసానికి శనితో సంబంధం ఉందని చెబుతారు. మార్గశిర మాసంలో ప్రారంభమై పుష్య మాసం ప్రారంభం వరకు ఈ కాలం కొనసాగుతుంది. ఈ సమయంలో వేకువజామున విష్ణు సహస్రనామ పారాయణం చేయడం అత్యంత శుభకరమని భావిస్తారు. అయితే గ్రహగతుల కారణంగా ఈ నెలలో వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు చేయకూడదని పండితుల అభిప్రాయం. ఉత్తర భారతదేశంలో ఈ కాలాన్ని ‘ఖర్మాస్’ అని కూడా పిలుస్తారు.

2025 డిసెంబర్‌ 16 నుంచి 2026 జనవరి 14 వరకు ధనుర్మాసం ఉంటుంది. అయితే ఇక్కడితో శుభకార్యాలకు విరామం పూర్తిగా ముగియదు. ధనుర్మాసం తర్వాత కూడా శుక్ర మౌఢ్యం కొనసాగుతుంది. ఇది 2026 ఫిబ్రవరి 17 వరకు, అంటే మాఘ మాసం బహుళ అమావాస్య వరకు ఉంటుంది. ఈ మౌఢ్య కాలంలో శుభకార్యాలు చేయకపోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం.

అందుకే 2026 మాఘ మాసం వచ్చే వరకు పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, గృహప్రవేశాలు, నామకరణం (బారసాల) వంటి శుభకార్యాలకు బ్రేక్‌ పడినట్టేనని పండితులు చెబుతున్నారు. అలాగే కొత్త వాహనాలు కొనడం, ఆస్తుల కొనుగోలు, బంగారం–వెండి వంటి విలువైన వస్తువుల కొనుగోలు కూడా ఈ సమయంలో చేయకపోవడం మంచిదని భావిస్తారు. అయితే కొన్ని ప్రాంతాల్లో, ఆయా సంప్రదాయాల ప్రకారం స్వల్ప మార్పులు ఉండవచ్చని కూడా చెబుతున్నారు.

గమనిక: ఈ కథనంలోని సమాచారం మత విశ్వాసాలు, సంప్రదాయాలు, జ్యోతిష్య శాస్త్రంలో చెప్పిన అంశాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇవి అవగాహన కోసం మాత్రమే. ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా పాఠకుల వ్యక్తిగత నిర్ణయం.

Tags:    

Similar News