వ్యవసాయ శాఖపై సీఎం జగన్ సమీక్ష.. డ్రోన్ల నిర్వహణపై రైతన్నలకు శిక్షణ...

YS Jagan: రైతులకు వ్యక్తిగత యంత్ర పరికరాలు అందించేలా కార్యాచరణ...

Update: 2022-05-07 04:30 GMT

వ్యవసాయ శాఖపై సీఎం జగన్ సమీక్ష.. డ్రోన్ల నిర్వహణపై రైతన్నలకు శిక్షణ...

YS Jagan: వ్యవసాయశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగాన్ని ఈ ఏడాది నుంచి అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు ఆఫీసులో జరిగిన సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి, సీఎస్ సమీర్ శర్మ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రైతు భరోసా కేంద్రాలు FAO చాంఫియన్‌ అవార్డుకు ఎంపికైన దృష్ట్యా వ్యవసాయశాఖ అధికారులను సీఎం అభినందించారు.

తోటబడి కార్యక్రమంలో మామిడి, అరటిపై కరదీపిక విడుదల చేశారు. అనంతరం రైతు భరోసా, రైతులకు పంట బీమా చెల్లింపు, సబ్సిడీపై రైతులకు వ్యవసాయ ఉపకరణాల పంపిణీ, ఖరీఫ్‌ సన్నద్ధత, కిసాన్‌ డ్రోన్లు, మిల్లెట్‌ పాలసీ, పంట మార్పిడి తదితర అంశాలపై సీఎం సమగ్రంగా చర్చించారు. ఈ నెల 11న మత్స్యకార భరోసా నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. ఈ నెల 16న రైతు భరోసా నిధులను విడుదల చేయాలని నిర్ణయించారు. జూన్‌ 15లోగా రైతులకు పంట బీమా పరిహారం అందించాలని సీఎం నిర్దేశించారు. అదే నెలలో 3వేల ట్రాక్టర్లు సహా, 4,014 కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లలో వ్యవసాయ ఉపకరణాలు పంపిణీ చేయాలని సూచించారు. ఆర్బీకే, ఇ– క్రాపింగ్‌ చాలా ముఖ్యమైన అంశాలని పటిష్టంగా ఆమలు చేయాలని సీఎం సూచించారు.

రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ పంపు సెట్లకు మోటార్లు బిగించాలని సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలట్‌ ప్రాజెక్టు విజయవంతమైనట్లు ముఖ్యమంత్రి తెలిపారు. దాదాపు 30 శాతం విద్యుత్‌ ఆదా అయ్యిందని, కనెక్షన్లు పెరిగినా 33.75 మిలియన్‌ యూనిట్ల కరెంటు ఆదా అయ్యిందని తెలిపారు. రైతులు వాడని కరెంటును ఉచిత విద్యుత్‌ పేరు మీద ఇప్పటి వరకూ లెక్క కడుతున్నారని, మీటర్ల కారణంగా వీటన్నింటికీ చెక్‌ పడే పరిస్థితి వచ్చిందని, పారదర్శక వ్యవస్థ ఏర్పడిందని సీఎం తెలిపారు. మీటర్ల ఏర్పాటు వల్ల రైతులకు నాణ్యమైన కరెంటు అందుతోందని, సిబ్బందిలోనూ జవాబుదారీతనం పెరిగిందన్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు అమర్చాలని సీఎం సూచించారు.

ఖరీఫ్ సమీపిస్తుండడంతో అధికారులతో సీఎం చర్చించి కీలక ఆదేశాలు జారీ చేశారు. కావాల్సిన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచుకోవాలని నిర్దేశించారు. ఇప్పటికే 6 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు జిల్లా స్దాయి నుంచి ఆర్బీకే స్ధాయి వరకు సిద్దం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సాగునీటికి ఎక్కడా కూడా ఇబ్బందులు రాకుండా సకాలంలో నీళ్లు విడుదల చేసే అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కౌలు రైతులకు అండగా ఉండాలన్న సీఎం.. CCRC వల్ల కౌలు రైతులకు మేలు జరుగుతుందన్నారు. వీలైతే ప్రతి ఇంటికీ వెళ్లి CCRCపై అవగాహన కల్పించాలన్నారు. ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కచ్చితంగా రైతులకు అందాలన్నారు. అన్ని ఆర్బీకేల్లో వీటికోసం స్టోరేజీ రూమ్స్‌ను నిర్మించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

Full View


Tags:    

Similar News