కాఫర్ డ్యామ్ భద్రతకు చర్యలేవి..: సీఎం జగన్

Update: 2019-06-20 14:47 GMT

పోలవరం ప్రాజెక్ట్‌ పనులను సీఎం జగన్ పరిశీలించారు. ప్రాజెక్ట్‌ పనులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఎం హోదాలో తొలిసారి పోలవరంలో పర్యటించిన జగన్‌ ప్రాజెక్ట్‌ ప్రాంతంలో ఏరియల్‌ సర్వే జరిపారు. అధికారులతో సమీక్ష నిర్వహించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి జగన్ మోహన్ రెడ్డి పోలవరం పర్యటించారు. మూడుసార్లు ఏరియల్ సర్వే ద్వారా ప్రాజెక్టు ప్రాంతాన్ని , ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ నిర్మాణాలను పరిశీలించారు. హెలికాప్టర్ దిగిన తర్వాత జగన్‌కు ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.

తర్వాత వ్యూ పాయింట్‌కు చేరుకుని ప్రాజెక్టును పరిశీలించారు జగన్. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎగువ కాఫర్ డ్యామ్ పనులు ఎంత వరకు వచ్చాయి..? గోదావరిలో వరద వస్తుందని తెలిసీ సీజన్ ముగిశాక ఎలా నిర్మాణం చేపట్టారని అధికారులను ప్రశ్నించారు. కాఫర్ డ్యామ్‌తో నీరు స్పిల్‌ వేపైకి వచ్చి నిర్మాణాలకు ఆటంకం కలిగితే ఎలా అడిగారు. సీఎం అడిగిన ప్రశ్నలకు అధికారులు వివరణ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం దీని నిర్మాణం ఎందుకు పూర్తి చేయలేకపోయారని అధికారులను జగన్ ప్రశ్నించారు.

పోలవరం పర్యటనలో సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిర్ణీత సమయానికి ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పోలవరం పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నిర్వాసితుల నుంచి వినతులు స్వీకరించారు. బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు జగన్. ఇళ్ల నిర్మాణంలో డబ్బులు విడుదల చేసే విషయాన్ని పరిశీలించాలని సూచించారు. సీఎంతో పాటు ఈఎన్‌సీ వెంకటేశ్వరావు, జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్ ‌దాస్, రాష్ట్ర మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, పిల్లి సుభాష్ చంద్రబోస్, పి.విశ్వరూప్, పలువురు ఎమ్మెల్యేలు పర్యటనలో పాల్గొన్నారు.  

Tags:    

Similar News