వైసీపీ ఎంపీ ఫ్యామిలీకి కరోనా.. వారిలో నలుగురు వైద్యులు
ఏపీలో కరోనా ఉగ్రరూపం దాల్చింది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి.
ఏపీలో కరోనా ఉగ్రరూపం దాల్చింది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో పరీక్షల సామర్ధ్యం పెంచిన తర్వాత కేసుల సంఖ్య మూడు రోజుల్లోనే 1100కు చేరువలో ఉంది. అత్యధిక కేసులు కర్నూలు జిల్లాలోనమోదయ్యాయి. ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ఘటన తర్వాత జిల్లాలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జిల్లాలో 279 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
అయితే తాజాగా వైసీపీ ఎంపీ కుటుంబంలో ఆరుగురికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ఎంపీనే మీడియాకు చెప్పారు. అయన ఇంట్లో వైరస్ సోకిన వారిలో ఎంపీ ఇద్దరు సోదరులు, వారి సతీమణులకు,14 ఏళ్ల బాలుడు తోపాటు, 83ఏళ్ల తండ్రికీ వైరస్ నిర్ధారణ అయింది. ఆరుగురిలో నలుగురు వైద్యులు అని వార్తలు వచ్చాయి. దీనిపై ఎంపిని అడగగా నిజమేనని చెప్పారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఇక ఇదే విషయమై ఎంపీ మీడియాతో మాట్లాడుతూ... తన కుటుంబసభ్యులకు కరోనా సోకిందన్న వార్తలు నిజమేనని పేర్కొన్నారు. తన కుటుంబంలో ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. కోవిడ్ ఆస్పత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారని వెల్లడించారు. ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా సోకుతోందని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.