మాటలకూ చేతలకూ పొంతన లేని బడ్జెట్:చంద్రబాబు

Update: 2019-07-13 02:08 GMT

'వైసీపీ నేతల మాటలకూ, చేతలకూ పొంతన లేని విధంగా ఏపీ బడ్జెట్ ఉందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శించారు. బడ్జెట్ ప్రసంగాన్ని పుస్తకంగా కాకుండా వైసీపీ పామ్ప్లేట్ గా చేశారని అయన అన్నారు. రైతులకు ఈ బడ్జెట్ లో అన్యాయం జరిగిందన్నారు. సున్నా వడ్డీ రుణాలకు రూ.4 వేల కోట్లు అవసరం ఉంటే.. రూ.100 కోట్లు మాత్రమే కేటాయించటంపై రైతులకు సమాధానమివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించేలా లేదన్న చంద్రబాబు, ఇది పేదల సంక్షేమానికి దోహదం చేసేలా లేదన్నారు.

బడ్జెట్‌పై చంద్రబాబు స్పందన ఇలా ఉంది..

- 'అమ్మఒడి' పథకం 'ఆంక్షల బడి'గా చేశారు. బిడ్డలను బడికి పంపే ప్రతి తల్లికి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు అని చూడకుండా ప్రతి తల్లికి ఇస్తామని చెప్పి, బడ్జెట్ లో 43లక్షల మంది తల్లులకు మాత్రమే ప్రయోజనం అన్నారు. మీ లెక్కల ప్రకారమే 78లక్షల మంది తల్లులలో ఎవరికి అమ్మఒడి కోత విధిస్తారో చెప్పలేదు.

- పక్కాగృహాల లబ్దిదారుల రుణాలన్నీ మాఫీ చేస్తామని టిడిపి చెబితే, ఇప్పుడు వైసిపి ప్రభుత్వ బడ్జెట్ లో 300చ.అ ఇళ్లకే ఆర్ధిక భారం తగ్గించడం మిగిలిన వారికి అన్యాయం చేయడమే.

- టీడీపీ ప్రభుత్వం 8లక్షల ఇళ్లు కట్టిందని చెప్పిన ఆర్ధికమంత్రి హవుసింగ్ కు బడ్జెట్ కేటాయింపులు 1% తగ్గించడాన్ని ఎలా సమర్ధించుకుంటారు..? 1% నిధులకు కోత పెడితే రాబోయే 5ఏళ్లలో 25లక్షల ఇళ్ల లక్ష్యం ఎలా చేరుకుంటారు..?

పించన్ రూ.3వేలకు పెంచుతామని, టిడిపి 3వేలిస్తే, మేము రూ4వేలు ఇస్తామని గొప్పలు చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక ఏడాదికి రూ.250 చొప్పున పెంచడం దివాలాకోరుతనం. దీనివల్ల ఒక్కొక్కరు ఏడాదికి రూ.18వేలు నష్టపోయారు. వృద్దులు, అనాధ మహిళలు, వికలాంగులు దాదాపు రూ.10వేల కోట్లు కోల్పోయారు.

- నిషేధం అంటూ ప్రభుత్వమే ఎలా మద్యం విక్రయాలు చేపడుతుందని ప్రజలే ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వమే వ్యాపారం చేస్తూ దానికి దశలవారీ నిషేధం ముసుగు వేయడం ఏమిటి..?

ఇతర రాష్ట్రాలలో విమర్శలు వచ్చినట్లుగానే నేరుగా మద్యం కంపెనీల నుంచే ముడుపులు దండుకునేందుకేనా ఈ ప్రభుత్వ మద్యం విక్రయాలు..?

పేదల ఆకలి తీర్చే అన్నా కేంటిన్లు మూతవేసి ప్రభుత్వ సారా దుకాణాలు నెలకొల్పి మందు తాగండని ప్రోత్సహించడం వైసీపీ ప్రభుత్వానికే చెల్లింది.

- సహజ మరణానికి 'చంద్రన్న బీమా' కింద రూ.2లక్షలు ఇచ్చేదానిని సగానికి తగ్గించి రూ.లక్ష చేశారు.

- పేదలకు ఉపయోగపడే పథకాలకు నిధుల్లో కోత విధించడం ద్వారా వైసీపీ నేతల పేదల వ్యతిరేక మనస్తత్వాన్ని చాటుకున్నారు.

రాజధానికి రూ.500కోట్లు, కడప స్టీల్ ప్లాంట్ కు రూ250కోట్లు కేటాయించి వాటితో ఏ పనులు పూర్తి చేద్దామని..? కనీసం స్టీల్ ప్లాంట్ భూమి చదునుకు కూడా ఆ నిధులు చాలవు. - విమాన సర్వీసులు రద్దు చేస్తే రాజధానికి ఎవరు వస్తారు, పెట్టుబడులు ఎలా వస్తాయి..?

- పారిశ్రామిక రాయితీలకు రూ.4వేల కోట్లు చెల్లించాల్సి వుండగా, గత బడ్జెట్ కన్నా ఈ బడ్జెట్ లో 0.88% తగ్గించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల వాతావరణానికి ఇది విఘాతం. వచ్చే పెట్టుబడులు రావు, యువతకు ఉపాధి ఉండదు.

- రాజధాని నిర్మాణానికి రూ.500కోట్లు మాత్రమే కేటాయించడాన్ని బట్టే అమరావతి పనులకు మోకాలడ్డారు. ఇప్పటికే ఇక్కడ పనులు నిలిచిపోయి భూముల ధరలు పడిపోయాయి. రియల్ ఎస్టేట్ రంగం హైదరాబాద్ తరలిపోయింది. లక్షలాది కూలీలు, భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు. మెషీనరిని తరలించేశారు, అయినా ప్రభుత్వంలో స్పందన లేకపోవడం గర్హనీయం.

పట్టణ ప్రాంతాల అభివృద్దికి, రాజధాని అభివృద్ధికి, గ్రామీణ ప్రాంతాల్లో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు నిధుల్లో కోత పెట్టడం ద్వారా రాష్ర్భ ప్రగతికి గండికొట్టారు.

- పర్యాటక రంగానికి బడ్జెట్ లో పెద్దగా కేటాయింపులు లేకపోవడంతో సేవారంగం ద్వారా ఆదాయం గణనీయంగా పడిపోనుంది.

- ఆర్టీసి విలీనం, సిపిఎస్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ అన్నింటిపై కమిటీల పేరుతో కాలయాపనే తప్ప అమలు చేసే చిత్తశుద్ది లేదు.

- నిరుద్యోగ భృతికి కేటాయింపులు లేవు. నైపుణ్యాభివృద్దికి 30% నిధులు తగ్గించారు. ఐటి ఎలక్ట్రానిక్స్ రంగానికి కోత విధించారు. యువత భవిష్యత్తుకు దోహదపడేలా బడ్జెట్ లేదు.

- రుణ బకాయిలు రూ.2.61లక్షల కోట్లు అని నిన్న ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. అంతకు ముందు శ్వేత పత్రంలో ఇదే మంత్రి రుణభారం రూ.3,62,375కోట్లు అన్నారు.

-నిన్న వైసీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు ఇచ్చిన జవాబులో గత ప్రభుత్వం 5ఏళ్లలో రూ.1,00,658కోట్లు అప్పు చేసిందని అన్నారు. ఇప్పుడు ఈ బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వ రుణం రూ.2,58,928 కోట్లకు పెరిగిందని అన్నారు. 3 రోజుల్లో 3మాటలు చెప్పడం, అబద్దాలు ఆడటం, గాంధీజీ సూక్తులు వల్లె వేయడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే చెల్లింది.

చివరికి బడ్జెట్ ప్రసంగం పుస్తకాన్ని కూడా పార్టీ పుస్తకంగా, వైసిపి కరదీపికగా మార్చడం శోచనీయం.

- జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఆకాశంలో ఉంటే, వాటికి బడ్జెట్ కేటాయింపులు మాత్రం పాతాళంలో ఉండటం వైసీపీ ప్రభుత్వ చేతకాని తనమే..

Tags:    

Similar News