ఏపీలో టీడీపీకి మరో షాక్ తగిలింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే ముద్దాలి గిరి త్వరలో వైసీపీలో చేరనున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యే గిరి వచ్చారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తో కలిసి ఆయన సీఎంను కలిశారు. పార్టీలో చేరికకు సీఎం అనుమతి తీసుకున్నట్టు తెలుస్తోంది. గతకొంత కాలంగా టీడీపీ అధినాయకత్వం పట్ల ఎమ్మెల్యే గిరి అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. రెండు నెలల కిందటే ఆయన వైసీపీలో చేరతారని అంతా భావించారు కానీ ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలవడంతో పార్టీ మార్పుపై స్పష్టత వచ్చినట్టయింది.
ఇప్పటికే టీడీపీ కీలకనేత దేవినేని అవినాష్ వైసీపీలో చేరారు. త్వరలో గంటా శ్రీనివాసరావు ఆయన తోపాటు ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వైసీపీలో చేరతారంటూ గతకొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. గంటా శ్రీనివాసరావు సమయం కోసం చూస్తున్నారు.. గొట్టిపాటి రవి అయితే ఇప్పటికే వైసీపీ కీలకనేతలు వైవీ సుబ్బారెడ్డి, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి లతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. వైసీపీలో చేరేందకు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికైనా సిద్ధమని గొట్టిపాటి అంటున్నారట. అలాగే నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీ ఇంఛార్జిగా ఉన్న బాచిన కృష్ణచైతన్యతో కూడా మాట్లాడుకుంటానని చెబుతున్నారట.
కాగా ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీకి మద్దతు ప్రకటించారు. సీఎం జగన్ తో కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్టు గతంలో వంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ తనకు చేసిన ప్రామిస్ మేరకు వైసీపీకి మద్దతు ఇస్తున్నానని చెప్పారు. అంతేకాదు తన నియోజకవర్గ ప్రజల కోసం, ఇళ్ల పట్టాల కోసం, తన కోరిక సఫలం అవడం కోసం ఇకనుంచి జగన్మోహన్ రెడ్డి వెంట నడవాలని నిర్ణయించుకున్నట్టు వంశీ గతంలోనే చెప్పారు. మొన్నటి వరకు జరిగిన అసెంబ్లీ సమావేశంలో కూడా వంశీ టీడీపీ సభ్యుల పక్కన కాకుండా వేరుగా కూర్చున్నారు. అంతేకాదు ఆ సమావేశాల్లో టీడీపీని తీవ్రంగా విమర్శించారు.