ప్రధానితో సీఎం జగన్ తప్పులు చెప్పారు.. మంత్రి నారాయణ స్వామిని బర్తరఫ్ చేయాలి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ప్రధానితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్ కావాలనే తప్పులు చెప్పారని ఆరోపించారు.టీడీపీ నేతలతో చంద్రబాబు వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదలకు అన్నంపెట్టే అన్న క్యాంటీన్లను మూసేసిన చరిత్ర జగన్‌దే అని విమర్శించారు.
గుంటూరు, కృష్ణా జిల్లాలు రెడ్ జోన్ పరిధిలోకి రావడం ప్రభుత్వ వైఫల్యమేనని చంద్రబాబు అన్నారు. కరోనా మరణాల విషయంలో ప్రభత్వం అసలు నిజాలు దాచడం వల్ల మరింత ప్రమాదం జరుగుతోందని, తద్వారా వాటిల్లే దుష్ఫలితాలకు విజయవాడ ఉదంతమే రుజువన్నారు. ఐదుగురికి భోజనం పెట్టాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలందరికీ పిలుపునిస్తే, అన్నా క్యాంటిన్లు మూసి పేదలకు కూడు లేకుండా చేశారని విమర్శించారు.
రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని జిల్లా ప్రాతిపదికగా విశ్లేషించాలే తప్ప.. మండలం ప్రాతిపదికగా చూపించడం సరైంది కాదని అన్నారు. ఉపాధి కోల్పోయిన పేద కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఇవ్వాలని రాష్ట్రంలో విపక్ష పార్టీలన్నీ కోరినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం సరికాదని విమర్శించారు.
ప్రజలను కరోనా మహమ్మారి బారిన స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన రమేష్ కుమార్‌ను ఎస్‌ఈసీ పదవి నుంచి తొలగించడం దుర్మార్గచర్య అని చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రజల ప్రాణాలు పోయినా ఫర్వాలేదు.. రాజకీయ లాభాలే తనకు ముఖ్యమనేలా.. వైసీపీ వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత లాక్‌డౌన్ సమయంలోనూ అనేక జిల్లాలలో అక్రమ మైనింగ్‌కు వైసీపీ నేతలు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాల్లో వందల ట్రాక్టర్లలో గ్రావెల్, మట్టి, ఇసుక అక్రమ రవాణా చేస్తున్నా పట్టించుకునేవారు లేరని విమర్శించారు.
కరోనా మహమ్మారిని ఏదో ఒక మతానికి అంటగట్టాలని చూడటం హేయమని, ముస్లింలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని పదవి నుంచి తొలగించాలని చంద్రబాబు డిమాండ్‌చేశారు. చంద్రబాబు అన్నారు. అంబేద్కర్ జయంతిని ఇళ్లలోనే నిర్వహించాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.