ఆ రెండు టిక్కెట్లు వారికే..!

Update: 2019-01-21 13:15 GMT

ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో వైసీపీ అధినేత వైయస్ జగన్ స్పీడ్ పెంచారు. ప్రస్తుతం నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న ఆయన మెల్లగా సీట్ల అనౌన్స్ మెంట్ కూడా చేస్తున్నారు. అయితే ఈ విషయం అధికారికంగా చెప్పకపోయినా పోటీ చేసే అభ్యర్ధికి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లాలోని రెండు కీలక నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. చిలకలూరిపేటకు బీసీ నాయకురాలు విడదల రజిని, సత్తెనపల్లికి అంబటి రాంబాబును ఫైనల్ చేశారు. ఇటీవల సత్తెనపల్లిలో చోటుచేసుకున్న పరిణామాలతో ఓ వర్గం కార్యకర్తలు అంబటి రాంబాబుకు కాకుండా వేరొకరికి టికెట్ ఇవ్వాలని కోరారు. అదికూడా మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత యర్రం వెంకటేశ్వరరెడ్డి లేదా కాసు ఫ్యామిలిలో ఎవరో ఒకరికి సత్తెనపల్లి టికెట్ ఇవ్వాలని సూచించినట్టు ప్రచారం జరిగింది. దాంతో అసంతృప్తి నేతల్ని హైదరాబాద్ కు పిలిపించుకున్న అధిష్టానం నేతలు వారిని బుజ్జగించారు. అదే క్రమంలో సీటు అంబటికేనన్న స్పష్టమైన సంకేతాలు కూడా ఇచ్చారు.

ఇక మరో నియోజకవర్గం చిలకలూరిపేటలో టికెట్ నాకంటే నాకు అని మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్, విడదల రజిని పోటీపడ్డారు. అయితే మంత్రి పత్తిపాటి పుల్లారావును తట్టుకోవాలంటే రాజశేఖర్ బలం సరిపోదని జగన్ భావించారు. అప్పటికే బీసీల్లో మంచి గుర్తింపు పొంది, ఆర్ధికంగా స్థితిమంతురాలైన విడదల రజినీని ఇంచార్జ్ గా నియమించారు. దాంతో మర్రి రాజశేఖర్ అసంతృప్తితో ఉన్నారు. అయితే ఆయనకు పార్టీలో అత్యున్నత పదవిని కట్టబెట్టడం తోపాటు ఎమ్మెల్సీ ఇస్తానని జగన్ మాట ఇవ్వగా అయిష్టంగానే ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న జగన్ చిలకలూరిపేట నియోజకవర్గాన్ని రజినీకి కేటాయిస్తూ ఫైనల్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 

Similar News