Andhra pradesh: అప్పటి ప్రభుత్వ తప్పిదం..3200 కోట్ల నష్టం !

ఒక్కోసారి చిన్నపాటి అలసత్వం భారీ మూల్యానికి దారితీస్తుంది. అటువంటిదే ఇది.

Update: 2020-02-27 04:59 GMT
Chandrababu And Jagan File Photo

ఒక్కోసారి చిన్నపాటి అలసత్వం భారీ మూల్యానికి దారితీస్తుంది. అటువంటిదే ఇది. ఆంధ్రప్రదేశ్ లో గడువు లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేక పోవడంతో దాదాపు 3200 కోట్ల నిధులు కేంద్రం నుంచి ఆగిపోయే పరిస్థితి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల ముందు పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెనుకంజ వేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. అసలే

ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతోన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పై ఇది పెద్ద ప్రభావమే. ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు కేంద్రం నుంచి వచ్చే నిధులపై జగన్ సర్కారు భారీ ఆశలు పెట్టుకుంది. కానీ కేంద్రం ఇచ్చే నిధుల్లో రూ.3200 కోట్లు రాష్ట్రానికి దక్కకుండా పోయే పరిస్థితి. 2020 మార్చి 31లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేకపోతే.. కేంద్రం నుంచి వచ్చే ఈ నిధులు ఆగిపోతాయి. అదే జరిగితే రానున్న కాలంలో గ్రామ పంచాయితీల అభివృద్ధి పనులపై ప్రభావం పడే అవకాశం ఉంది.

వాస్తవానికి 2018 ఆగష్టులోనే పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ఆ ఫలితాల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై పడుతుందనే భావనతో నాటి టీడీపీ సర్కారు ఎన్నికలను వాయిదా వేసింది. ఈ నిర్ణయం ప్రభావం పంచాయతీలకు అందే నిధులపై పడింది.

మార్చి 15లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ఇటీవల జగన్ సర్కారు ప్రకటించింది. కానీ స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు 59.85 శాతానికి చేరాయి. రిజర్వేషన్లు 50 శాతం దాటడాన్ని సవాల్ చేస్తూ టీడీపీ నేత బి.ప్రతాప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ అంశం హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. అదీగాక పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పాఠశాలల భవనాలను ఉపయోగిస్తారు. టీచర్లు కూడా ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సి ఉంటుంది. మార్చి 4 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు, మార్చి 23 నుంచి ఏప్రిల్ 10 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి నెలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం సాధ్యపడకపోవచ్చు. ఈ నేపధ్యం లో జగన్ సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News