ప్రకాశం జడ్పీ పీఠం : వైసీపీలో ఆయనకు లైన్ క్లియారా..!

Update: 2020-01-05 02:18 GMT

ఏపీలో జిల్లా పరిషత్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రెండు రోజుల కిందటే రిజర్వేషన్ల జాబితాను కూడా ప్రభుత్వం ప్రకటించింది. జడ్పీ చైర్మన్ పీఠంపై కూర్చువాలని రాజకీయ నిరుద్యోగులు తెగ ఉవ్విళ్లూరుతున్నారు. అందులో ముఖ్యంగా అధికార వైసీపీలో అయితే పోటీ మరింత ఎక్కువగా ఉంది. ప్రకాశం జిల్లా జడ్పీ పీఠం ఈసారి కూడా జనరల్ కే రిజర్వ్ అయింది. దాంతో ఆశావహులు జాబితా కూడా భారీగానే ఉంది. పర్చూరు ఇంచార్జ్ గొట్టిపాటి భరత్, మాజీ ఎమ్మెల్యేలు జంకే వెంకటరెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే వీరిలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికే ఎక్కువ అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

గతంలో దర్శి ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన 2014 ఎన్నికల్లో తక్కువ ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. 2019 లో కూడా దర్శి సీటును అధిష్టానం ఆఫర్ చేసినా పోటీ చేయలేనని.. సంతనూతలపాడు, దర్శి నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ రెండు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు భారీ విజయం సాధించారు.

అయితే ఎన్నికల సమయంలోనే బూచేపల్లిని జిల్లా పరిషత్ చైర్మన్ ను చేస్తానని జగన్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. పైగా వైఎస్ కుటుంబంతో బూచేపల్లి కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. మరోవైపు మార్కాపురం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ప్రధాన కార్యదర్శి జంకే వెంకటరెడ్డి.. పేరుకు ఎమ్మెల్సీపై ఆశలు పెట్టుకున్నా ఆయన కూడా జడ్పీ పీఠంపై కన్నేశారని తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున మార్కాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన జంకే.. 2019 లో అనివార్య కారణాలతో సీటు త్యాగం చెయ్యవలసి వచ్చింది.

 అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్సీ లేదంటే నామినేటెడ్ పదవి ఇస్తానని జంకేకు.. జగన్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్సీ వస్తుందో లేదో అని అనుమానంతో ఉన్న జంకే జడ్పీ చైర్మన్ పీఠంపై అధిష్టానంతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు గొట్టిపాటి భరత్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే భరత్ కు గతంలో ఎమ్మెల్సీ పదవి ఇస్తానని జగన్ ప్రకటించారు. కానీ 2019 ఎన్నికల్లో పర్చూరులో వైసీపీ ఓటమి చెందడంతో ఆయన తనకు ఎమ్మెల్సీ రాదేమోనన్న అభిప్రాయానికి వచ్చి జడ్పీ పీఠంపై ఆశలు పెట్టుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి ఏమి జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News