కోనసీమలో అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహించే ప్రభల ఉత్సవం

* ఉత్సవాల్లో భారీ ఊరేగింపులు, బాణసంచాపై నిషేధం * పోలీసుల ఆంక్షలను ససేమిరా అంటున్న నిర్వహకులు * అమలాపురం డీఎస్పీ ఆద్వర్యంలో 11 గ్రామాల నుంచి ప్రభలు తరలింపు

Update: 2021-01-14 12:27 GMT

Prabhala festival (file image)

సంక్రాంతి సందర్భంగా కనుమ పండుగ రోజున కోనసీమలో అత్యంత భక్తిశ్రద్దాలతో నిర్వహించే ప్రభాల ఉత్సవం వివాదంగా మారింది. ప్రభాల తీర్థంపై పోలీసుల ఆంక్షలను నిర్వహకులు ససేమిరా అంటున్నారు. ఆచారంతో సంప్రదాయ బద్దంగా నిర్వహించే భారీ ఊరేగింపులు, బాణసంచా కాల్పులపై నిషేధం ఉండకూడదని నిర్వహకులు పట్టుపడుతున్నారు. 

కోనసీమ నడుమ తరతరాలనుండీ జరుగుతున్న "జగ్గన్నతోట" ప్రభలతీర్థం వైభవానికి ఎంతో ప్రఖ్యాత వుంది. ఈ తోటలో ఏవిధమైన గుడిగానీ, గోపురం గానీ వుండవు. ఇది పూర్తిగా కొబ్బరితోట. ఏకాదశ రుద్రులు సంవత్సరానికి ఒకసారి ఇక్కడ సమావేశం అవ్వడంతో ఈతోట విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. లోక కల్యాణార్ధం సుమారు 400 సంవత్సరాల క్రితం 11 గ్రామాల రుద్రులు ఈ తోటలోనే సమావేశం అయ్యారని ప్రతీతి. అప్పటి నుండీ క్రమం తప్పకుండా ప్రతీ సంవత్సరమూ కనుమ రోజు ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఈ రుద్రులను ఒక్కచొట చేర్చుతారు ఈ గ్రామస్తులు.

సంస్థానదీశులైన శ్రీరాజావత్సవాయి జగన్నాధ మహారాజుకు చెందిన ఈ తోట జగ్గన్న తోట అనే పేరుతో స్థిరపడింది. ఈ ఏకాదశరుద్రులు కొలువైన గ్రామాల్లో స్వామివార్లను "ప్రభలపై" అలంకరించి మేళ తాళాలతో ఆయా గ్రామాల నుంచి ఈ తోటకు తీసుకువస్తారు. ఇక్కడ మరో విశిష్టత ఏమిటీ అంటే గంగలకుర్రు మరియూ గంగలకుర్రు అగ్రహారం రుద్రప్రభలు ఈ తోటకి రావాలంటే మధ్యలో కౌశిక కాలువ దాటాలి. ఆప్రభలు ఆకాలువ లోంచి ఏమాత్రం తొట్రూ లేకుండా తీసుకువచ్చే ఆ గ్రామస్తుల ధైర్యం చూడడానికి రెండు కళ్ళు చాలవు. ఒక 30 మంది మోస్తే కానీ లేవని ప్రభ ఆ కాలువలోంచి తోటలోకి తీసుకువచ్చే సన్నివేశం చూసేవారికి ఒల్లుగగుర్పొడుస్తుంది. ఇక ఆకాలువలోకి వచ్చే ముందు ఒక వరి చేనుని ఆ ప్రభలు దాటాల్సి వస్తుంది. అక్కడ పంటను తొక్కుతూ వచ్చినా రైతులు భాదపడక సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడు తమ చేలగుండా వెళ్ళడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. ఈ తీర్థమును దర్శించడానికి ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన కోనసీమ ప్రజలే కాక, దేశవిదేశీయిలు వచ్చి దర్శించి తరిస్తారు.

ఇదిలా ఉండగా ప్రభాల ఉత్సవం వివాదంగా మారింది. ఉత్సవాల్లో భారీ ఊరేగింపులు, బాణసంచా కాల్పులుపై పోలీసులు నిషేధం విధించారు. ఐతే, ఆచారంతో సంప్రదాయబద్దంగా నిర్వహించే ఉత్సవాలపై నిషేధం ఉండకూడదని అనుమతి ఇచ్చి తీరాలని నిర్వహకులు పట్టుబడుతున్నారు.

అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి ఆద్వర్యంలో 11 గ్రామాల నుండి ప్రభలను తీసుకువచ్చే రహదారుల్లో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు, ఎక్కడ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News