అమెరికాలో బీజేపీ నేత రామ్ మాధవ్ తో జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీ

Update: 2019-07-07 13:33 GMT

అమెరికాలో తానా వేదికగా తెలుగు రాష్ట్రాల రాజకీయనేతలు మంతనాలు జరపడం ఆసక్తిని రేకెత్తించింది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ నేత రామ్ మాధవ్ తానా వేడుకల్లో కలిశారు. ఈ సందర్భంగా ఇరువురూ భేటీ అయ్యారు. దీంతో అందరిలోనూ ఆసక్తి రేకెత్తింది. చాలా కాలంగా బీజేపీకి చాలా దూరంగా ఉంటున్న పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా రామ్ మాధవ్ తో చర్చలు జరపడం అందరి దృష్టినీ ఆకర్షించింది. పవన్ బీజేపీలో చేరే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే, చర్చల అనంతరం రామ్ మాధవ్ మాట్లాడుతూ, ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో పనిచేసే ఉద్దేశం లేదని, అయితే పార్టీలోకి ఎవరొచ్చినా స్వాగతిస్తామని చెప్పారు. పవన్ కల్యాణ్ ను స్నేహపూర్వకంగానే కలిశానని, తమ భేటీ వెనుక రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో బలమైన రాజకీయశక్తిగా ఎదగడమే ప్రస్తుతం బీజేపీ ముందున్న లక్ష్యం అని వెల్లడించారు. కాగా, ఇదే అంశం పై పవన్ కళ్యాణ్ ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు. బీజేపీతో తనకు వ్యక్తిగత విభేదాలేవీ లేవని, ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో బీజేపీని ప్రశ్నించానని తెలిపారు. అదేవిధంగా రామ్ మాధవ్ తో ఉన్న పాత పరిచయం తోనే తాను ఆయనను కలిశానని, అంతకు మించి ఏమీ లేదని వివరించారు. దీని వెనుక ఏ ఆపరేషన్లూ, ఆకర్ష్ లూ లేవని స్పష్టం చేశారు. అయితే, ఇరువురు నేతల మధ్య నెలరోజుల జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రముఖంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. 

Tags:    

Similar News