గోదావరిలో నీరు లేదు.. పట్టిసీమ పంపింగ్ నిలిపివేత

Update: 2019-07-01 04:50 GMT

గోదావరిలో నీటి లభ్యత తగ్గిపోవడం తో పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా కృష్ణా నదికి గోదావరి జలాల విడుదలను ఆదివారం నిలిపివేశారు. గోదావరి నీటిమట్టం పోలవరంలో 13.95 అడుగులకు చేరింది. దీంతో ఉభయ గోదావరి జిల్లాల ఆయకట్టుకు సాగునీటి సరఫరా చేసేందుకు మాత్రమే ఈ నీరు సరిపోతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని పోలవరం కుడికాలువ ద్వారా నీటి విడుదలను నిలిపి వేసినట్టు ధవళేశ్వరం హెడ్‌ వాటర్‌వర్క్స్‌ ఎస్‌ఈ ఎన్‌.కృష్ణమూర్తి తెలిపారు. ఈ నెల 26 నుంచి పట్టిసీమలో రెండు పైపుల ద్వారా రోజుకు 700 క్యూసెక్కుల చొప్పున మొత్తం 5 రోజుల్లో 3,500 క్యూసెక్కుల నీటిని పంపారు. శనివారం జరిగిన డీడీఆర్‌సీ సమావేశంలో జిల్లాలో సాగుకు నీటి విషయంపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌ సమీక్షించారు. ఈ నేపథ్యంలో పట్టిసీమ ఎత్తిపోతలను నిలిపివేయాలని నిర్ణయించారు. దీంతో అధికారులు ఆదివారం నీటి విడుదలను నిలిపివేశారు. 

Tags:    

Similar News