ఎంపీ మాధవ్ ప్రసంగానికి అదనపు సమయం కోరిన ఎంపీ నవనీత్ కౌర్

Update: 2019-07-04 15:40 GMT

పార్లమెంటు సమావేశాల్లో మొదటి ప్రసంగంలోనే హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రజా సమస్యలపై తనదైన శైలిలో తెలుగు పద్యాలు, హిత వచనాలతో అందర్నీ ఆకట్టుకున్నారు. జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, పశువులు కబేళాలకు రైతులు తరలిస్తున్న వైనాన్ని, మహిళలు వ్యభిచార గృహాలకు తరలిపోకుండా నిరోధించడం తదితర చర్యలను చేపట్టాల్సిన విషయాన్ని సభ ఆకట్టుకునే విధంగా తెలియజేశారు. ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో , అక్కడ దేవతలు తిరుగుతారని మన పురాణాల్లో నుండి వస్తున్న యదార్థ విషయం. శాసనాలు చేసే పార్లమెంట్ పరిధిలోని ఢిల్లీ, హర్యానా తదితర రాష్ట్రాల్లో ఈ వ్యభిచార గృహాలు ఉండడం సిగ్గుచేటైన విషయం అన్నారు. మహిళలకు సరైన ఉపాధి కల్పించి, వారి అభివృద్ధికి బాటలు వేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉందన్నారు. అలాగే గల్ప్ దేశాలకు వెళ్లే మహిళలపై లైంగిక వేధింపులు అధికంగా జరుగుతున్నాయన్నారు. ఒక మహిళ విదేశాలకు వెళ్లే పరిస్థితి వచ్చిందంటే ఆ కుటుంబ పరిస్థితి దయనీయంగా ఉంటుంది. అలాంటి కుటుంబాల కోసం ప్రత్యేకంగా ఆకర్షణీయ వేతనాలు చెల్లించేలా ఉపాధి మార్గాలను అన్వేషించాలని ఎంపీ మాధవ్ కోరారు.

ఉపాధి హామీ చట్టం గురించి మాట్లాడుతూ కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో రైతులు పూర్తిగా నష్టపోయారన్నారు. రైతుల పొలాల్లో ఉపాధి హామీ కూలీలు పనులు చేసే విధంగా చట్టం చేస్తే రైతులకు కాస్త ధైర్యం ఇచ్చిన వారమవుతామని ఎంపీ తెలిపారు. కాగా సమయ భావం వల్ల స్పీకర్ తన ప్రసంగం ముగించాలని పదే పదే విజ్ఞప్తి చేసినా పట్టించుకోకుండా ఎంపీ తన ప్రసంగం కొనసాగించారు.  మాజీ తెలుగు హీరోయిన్, ప్రస్తుత మహారాష్ట్ర ఎంపి నవనీత్ కౌర్ కూడా ఎంపీకి మద్దతు గా ఒక్క నిమిషం మాట్లాడనివ్వాలని సైగలతో స్పీకర్ ను కోరడం విశేషం.

Tags:    

Similar News