Kodi Pandalu: సై అంటున్న కోడి పుంజులు.. కాళ్లు దువ్వుతున్న పందెం కోళ్లు
Kodi Pandalu: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి కోడి పందేలు మొదలయ్యాయి
Kodi Pandalu: సై అంటున్న కోడి పుంజులు.. కాళ్లు దువ్వుతున్న పందెం కోళ్లు
Kodi Pandalu: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి కోడి పందేలు మొదలయ్యాయి. పండగ మూడు రోజులూ జరిగే ఈ పందేలను వీక్షించేందుకు, వేలు, లక్షల్లో పందెం కాసేందుకు వేలాదిగా తరలివస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున బరులు ఏర్పాటు చేశారు. వీటిలో కోట్ల మేర పందేల రూపంలో చేతులు మారతాయని అంచనా వేస్తున్నారు. తొలి రోజే సుమారు 6 కోట్ల వరకూ పందేలు జరిగాయని తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఉద్యోగాలు, వ్యాపారాలతో స్థిరపడిన వారందరూ కార్లలో సొంతూళ్లకు వచ్చి మరీ కోడి పందేలను ఆసక్తిగా తిలకిస్తున్నారు. బరుల వద్దకు మోటార్ సైకిళ్లు, కార్లలో అధిక సంఖ్యలో వస్తున్నారు. పలుచోట్ల బరుల వద్ద గుండాటలు కూడా ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల వీటిని పోలీసులు అడ్డుకున్నారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం గెద్దనపల్లిలో భారీ బరి ఏర్పాటైంది. ఇక్కడ కోట్లలో పందేలు కాస్తున్నారు. మండల కేంద్రమైన మలికిపురంలో కూడా భారీ బరి ఏర్పాటు చేశారు. లక్కవరం, కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, అల్లవరం, అమలాపురం రూరల్ మండలం కామనగరువు, ఇందుపల్లిలో సైతం పెద్ద బరులు ఏర్పాటయ్యాయి. ముమ్మిడివరం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో నిర్వాహకులు క్రికెట్ పోటీలను తలపించే రీతిలో కోడి పందేలు సాగిస్తున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి, బారికేడ్లు, ఎల్‌ఈడీ స్క్రీన్లతో బరులు ఏర్పాటు చేసి మరీ పందేలు నిర్వహించారు.