'అమ్మఒడి'.. వారికి మాత్రమే అన్నది ప్రచారమే : ఏపీ ప్రభుత్వం

Update: 2020-01-01 03:20 GMT

పిల్లలను పాఠశాలలకు పంపించే ప్రతి నిరుపేద తల్లికి ఏటా రూ.15 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందించే బృహత్తర సంక్షేమ కార్యక్రమం 'జగనన్న అమ్మ ఒడి'. ఈ పథకాన్ని ఈనెల 9న అధికారికంగా ప్రారంభిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. 'జగనన్న అమ్మ ఒడి' కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ ప్రారంభిస్తారని సచివాలయ వర్గాలు వెల్లడించాయి. తొలుత జనవరి 26 నుంచి ఈ పథకం ప్రారంభించేలా ప్రకటన చేసినా, దానిని జనవరి 9వ తేదీకి మార్చారు.

అమ్మఒడి కి రాష్ట్రంలోని స్కూళ్లు 61,271 కాలేజీలు 3,083 అర్హత సాధించాయని ప్రభుత్వం పేర్కొంది. అయితే కొన్ని పాఠశాలలు, కాలేజీలకు గుర్తింపు రద్దైన కారణంగా అమ్మఒడి వర్తింపు కాలేదు. కానీ ఈ పాఠశాలలో విద్యార్థులు కూడా లేరని ప్రభుత్వం గుర్తించింది. అమ్మఒడి పథకానికి ఇప్పటి వరకు అర్హులుగా గుర్తించిన తల్లులు/ సంరక్షకులు 42,80,823 ఉన్నారు. ఇంకా పరిశీలన కొనసాగుతున్నతల్లులు/ సంరక్షకులు 13,37,168 పేర్లు ఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. కేవలం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే అమ్మఒడి వర్తింపు అని ప్రచారం చేస్తున్నారని.. అది అవాస్తవమని.. రాష్ట్రంలోని అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్‌ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 1వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులు/సంరక్షకులకు ఈ పథకానికి అర్హులు అని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అయితే కొందరికి రేషన్ కార్డులు లేనందున ఈ పథకానికి అనర్హులుగా గుర్తించామని.. ఎవరైనా అర్హులైన వారికి రేషన్ కార్డు లేకపోతే అప్లై చేసుకున్న తరువాత తప్పకుండా అర్హులుగా గుర్తిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. జనవరి తొమ్మిదో తేదీన అమ్మఒడి ప్రారంభం అవుతుందని అన్నారు. అలాగే జనవరి 4న అమ్మ ఒడి, 6న మధ్యాహ్న భోజన పథకం అమలు, 7న ఇంగ్లిష్‌ మీడియం బోధన, ఆవశ్యకత, ఉపాధ్యాయులకు శిక్షణ, 8న మన పాఠశాల నాడు–నేడు అమలు, పాఠశాలల్లో వచ్చే మార్పులపై అవగాహన కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు.

Tags:    

Similar News