apnews: ఏపీ గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో దానికే డిమాండ్!

ఏపీ గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలకు వచ్చిన దరఖాస్తుల్లో పంచాయతీ సెక్రెటరీ ఉద్యోగానికే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 14 రకాల ఉద్యోగాల్లో ఈ ఉద్యోగానికే భారీ స్పందన కనిపించింది. మరోవైపు పశుసంవర్థక సహాయకుని ఉద్యోగాలకు దరఖాస్తులే కరువయ్యాయి.

Update: 2019-08-28 03:14 GMT

ఏపీ గ్రామ సచివాలయాల్లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి ఉద్యోగార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. పంచాయతీ కార్యదర్శి పోస్ట్ సహా.. మొత్తం 14రకాలైన పోస్ట్ లకు దరఖాస్తులు ఆహ్వానించారు. అయితే, ఇన్ని పోస్టుల్లోనూ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగానికే అభ్యర్థులు ఎక్కువగా మొగ్గు చూపారు. మొత్తం పోస్టులకు వచ్చిన దరఖాస్తుల తీరుతెన్నులు పరిశీలిస్తే.. 1.26 లక్షల ఉద్యోగాలకు రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు అంటే సగటున ఒక్కో పోస్ట్ కు 17 మంది దరఖాస్తు చేసుకున్నారు.  

ఇందులో సగానికి పైగా దరఖాస్తులు పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలకే వచ్చాయి. మొత్తం 36,449 సెక్రటరీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా.. 12,54,071 మంది ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో సెక్రెటరీ ఉద్యోగానికీ 34 మంది పోటీ పడుతున్నారన్నమాట. డిగ్రీ విద్యార్హతతో ఈ ఉద్యోగాలు పొందే అవకాశం ఉండడంతో అందరూ దీనిపై ఎక్కువ ఆసక్తి చూపించినట్టు భావించవచ్చు.

ఇక సెక్రటరీ పోస్ట్ తరువాత అదేస్తాయిలోని విలేజ్ సెక్రటరీ (డిజిటల్ సహాయకుడు) పోస్ట్ కు ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. ఈ విభాగంలో మొత్తం పోస్ట్ లు 11,158 కాగా, దరఖాస్తులు చేసినవారు 2,95,931 మంది అంటే దాదాపుగా ఒక్కో పోస్ట్ కు 26 మంది పోటీ పడుతున్నారు. అదేవిధంగా పారిశుధ్య పర్యావరణ సహాయకుడు ఉద్యోగాలకు 3,648 పోస్ట్ లకు గానూ, 63,401మంది దరఖాస్తు చేశారు. అంటే సగటున ఒక్కో ఉద్యోగానికి 21 మంది పోటీ పడుతున్నారు.

అన్నిటి కన్నా తక్కువ డిమాండ్ పశు సంవర్థక సహాయకుడు పోస్టులకు కనిపించింది. ఈ పోస్టులకు దరఖాస్తులు చాలా తక్కువ వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 9,886 ఉద్యోగాలకు 6,265 దరఖాస్తులే వచ్చాయి.


Tags:    

Similar News