ఆయేషా మీరా పేరుతో విద్యా సంస్థ నెలకొల్పండి

Update: 2025-12-27 08:21 GMT

మంగళగిరి: తమ కుమార్తె ఆయేషా మీరా పేరుతో విద్యా సంస్థను నెలకొల్పి, డిసెంబర్ 27వ తేదీన సంస్మరణ దినోత్సవం నిర్వహించాలని ఆమె తల్లిదండ్రులు శంషాద్ బేగం, బాషా ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ను కోరారు. మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజను ఈరోజు వారు కలిసి ఒక వినతి పత్రం అందజేశారు.

రాష్ట్రంలో సంచలనం స‌ృష్టించిన ఆయేషా మీరా హత్య కేసుకు ఈరోజుతో 18 ఏళ్ళు పూర్తి అయ్యాయి. ఇన్నేళ్లైనా, ఈ కేసులో నిందితుడిని కనిపెట్టలేకపోవడం బాధాకరమైన విషయం. పోలీసులు, సిట్, సీబీఐ లాంటి ధర్యాప్తు సంస్థలన్నీ ఏం చెయ్యలేక చేతులు ఎత్తేశారు. ఇది అత్యంత దారుణం.

వైస్సార్ హయాంలో 2007 డిసెంబర్ 27న విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలోని ఒక లేడీస్ హాస్టల్‌లో 17 ఏళ్ళ ఫార్మసి విద్యార్థిని రేప్ చేసి, హత్య చేశారు. అప్పటి నుంచి ఆమె తల్లిదండ్రులు శంషాద్ బేగం, బాషా న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఆమె తల్లి పోరాటపటిమ గుర్తుంచుకోదగినది.

సీబీఐ దర్యాప్తు ప్రారంభించిన తర్వాత విజయవాడ కోర్టులో కేసుకు సంబంధించిన ఫైళ్లన్నీ మాయమైపోయాయి. ఉన్న ఆధారాలతోనే సీబీఐ దర్యాప్తు సాగించింది. రెండు నెలల క్రితం దర్యాప్తు పూర్తయిందని సీబీఐ హైకోర్టుకు తెలిపింది. హైకోర్టు ఆదేశంతో ఆ నివేదికను విజయవాడలోని సీబీఐ కోర్టులో అందజేసింది. తర్వాత సత్యంబాబును నిందితుడిగా పేర్కొనడంపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని ఆయేషా మీరా తల్లిదండ్రులకు కోర్టు నోటీసులు అందజేసింది. దీనిపై వారు సీబీఐ నివేదికను తమకు అందజేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం ద్వారా కొన్ని కాగితాలు మాత్రమే తమ చేతికి అందాయని, వారి తరపున న్యాయవాది తెలిపారు.

న్యాయం కోసం ఇప్పటికీ ఆమె తల్లిదండ్రులు న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. ఎన్ని మలుపులు తిరిగినా ఈ కేసులో న్యాయం జరుగుతుందనే నమ్మకం లేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తమ కుమార్తె ఆయేషా మీరా పేరుపై ఓ విద్యా సంస్థను నెలకొల్పమని, డిసెంబర్ 27న సంస్మరణ దినోత్సవం నిర్వహించమని ఆయేషా తల్లిదండ్రులు కోరుతున్నారు.  

Tags:    

Similar News