Pawan Kalyan: పవన్‌కల్యాణ్ పొత్తు వ్యాఖ్యలపై ఏపీ బీజేపీలో చర్చ
Pawan Kalyan: ఇక నుంచి కేంద్ర పెద్దల ఆదేశాల మేరకే నడుచుకోవాలని నిర్ణయం
Pawan Kalyan: పవన్‌కల్యాణ్ పొత్తు వ్యాఖ్యలపై ఏపీ బీజేపీలో చర్చ
Pawan Kalyan: ఏపీలో నెలకొన్న రాజకీయ వాతావరణం ఎవరికి అంతు చిక్కడం లేదు. ఎన్నికల్లో ఎవరు ఎవరితో కలిసి పోటీ చేస్తారనే విషయంపై తీవ్ర చర్చ నడుస్తోంది. టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ ఉంటుందో లేదోననే విషయం ఇప్పట్లో తేలేలా లేదు. అయితే జనసేన టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ‌్తుందని ప్రకటించిన నేపథ‌్యంలో.. ఆ పార్టీతో మైత్రి విషయంలో ఎలా ముందుకు వెళ్దామనే దానిపై ఏపీ బీజేపీ నాయకత్వం సందిగ్ధంలో పడిందా అనే చర్చ నడుస్తోంది.
చంద్రబాబు అరెస్టు అనంతరం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రకటనలపై ఏపీ బీజేపీలో చర్చ జరుగుతోంది. తమతో సంప్రదించకుండా పొత్తులపై ప్రకటన చేయడంపై ఏపీ బీజేపీ అసహనంగా ఉందన్న టాక్ వినిపిస్తోంది. పొత్తుల విషయంలో పవన్‌కల్యాణ్ తమ పార్టీ గురించి మాట్లాడకుండా.. ఏపీలో జనసేన, టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని చెప్పడంపై రాష్ట్ర నాయకత్వం అసహనం వ్యక్తం చేస్తోంది. అయితే జనసేన బీజేపీతోనే ఉందని, ఆ పార్టీకి చెందిన పెద్దలతో పదే పదే చెప్పడం పట్ల కూడా గుర్రుగా ఉంది రాష్ట్ర నాయకత్వం. మరో వైపు రాష్ట్ర నేతలతో అంటి అంటన్నట్లు ఉంటున్నారనే చర్చ కూడా నడుస్తోంది. ఇక నుంచి కేంద్ర పెద్దల ఆదేశాల మేరకు నడుచుకోవాలని ఏపీ బీజేపీ నేతలు భావిస్తున్నారని సమాచారం.
టీడీపీ-జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తాయని ప్రకటించారు పవన్‌కల్యాణ్. అయితే ఇప్పటికే బీజేపీ-జనసేన మధ్య పొత్తు ఉంది.. ఇప్పుడు టీడీపీ, జనసేనతో బీజేపీ కలిసి వస్తుందా? లేదా? అనే విషయాన్ని బీజేపీ వారే తేల్చుకోవాలని పవన్ స్పష్టం చేశారు. మరోవైపు బీజేపీ అధిష్టానమే పొత్తుల విషయం చూసుకుంటుందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చెబుతున్నారు. బీజేపీతో పొత్తులో ఉంటూనే టీడీపీతో కలిసి పోటీ చేస్తామని పవన్ ఎలా ప్రకటన చేస్తారనే అంశంపై బీజేపీలో అసహనం వ్యక్తం అవుతోంది. పొత్తులపై పవన్ కల్యాణ్ ప్రకటన.. ఆయన అభిప్రాయాలను జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామని, పొత్తులతో పాటు పవన్ కామెంట్ల విషయంలో జాతీయ పార్టీ సూచనల మేరకు వ్యవహరిస్తామన్నారు పురంధేశ్వరి. మొత్తంగా పవన్‌కల్యాణ్ ప్రకటనలు ఏపీ బీజేపీలో తీవ్ర చర్చకు దారి తీశాయి.