రేపు సీఎం జగన్ తో బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు ప్రతినిధుల భేటీ
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన మరో కమిటీ బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు సంస్థ ప్రతినిధులు రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారు.
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన మరో కమిటీ బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు సంస్థ ప్రతినిధులు రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారు. ఈ సందర్బంగా రాజధాని అంశంపై నివేదిక సమర్పించే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎంను కలిసి నివేదిక సమర్పించి అనంతరం గంటపాటు నివేదికపై చర్చించే అవకాశం ఉంది. కాగా రాజధాని, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికోసం ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ ఇదివరకే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది..
రేపు ఇచ్చే బీసీజీ తోపాటు జీఎన్ రావు కమిటీ నివేదికలు రెండింటిని కలిపి ఈనెల 8న రాష్ట్రప్రభుత్వం క్యాబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. రిపబ్లిక్ డే తరువాత రెండు రోజుల ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ఈ నివేదికలపై చర్చించనుంది. అంతకంటే ముందు అఖిలపక్ష సమావేశాన్ని ఏపీ ప్రభుత్వం నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
'దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులుంటాయి. ఆ నమూనాలో బహుశా అమరావతిలో శాసన కార్యకలాపాల రాజధాని పెట్టొచ్చు. విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని పెట్టొచ్చు. యంత్రాంగమంతా అక్కడి నుంచే పనిచేసేలా ఏర్పాట్లు చెయ్యవచ్చు. కర్నూలులో హైకోర్టు పెట్టొచ్చు. ఈ విధంగా న్యాయ రాజధాని ఓవైపు, కార్యనిర్వాహక రాజధాని మరోవైపు, శాసన రాజధాని ఇక్కడ (అమరావతిలో) ఉండొచ్చు' అని సీఎం జగన్ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు.
దీనిపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వ వ్యాఖ్యలపై అమరావతిలో కొందరు రైతులు రెండు వారాలుగా దీక్షలు, ధర్నాలు చేస్తున్నారు. వారికి వైసీపీ సహా అన్ని పార్టీలు మద్దతు పలుకుతున్నాయి.