బొత్స మేనల్లుడికి కీలక పదవి రాబోతుందా?

Update: 2019-12-25 01:56 GMT

మజ్జి శ్రీనివాసరావు.. ఈ పేరంటే పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. చిన్న శ్రీను అంటే మాత్రం టక్కున గుర్తుకు వస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, మంత్రి బొత్స సత్యనారాయణకు స్వయానా మేనల్లుడు. విజయనగరం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా వ్యవహారాల సమన్వయకర్త పొజిషన్ లో ఆయన ఉన్నారు. జిల్లాలో పార్టీ కార్యక్రమాలను మజ్జి శ్రీనివాసరావే చూస్తున్నారు. బొత్స తో కలిసి వైసీపీలో చేరిన మజ్జి.. విజయనగరం తోపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర జరుగుతున్నప్పుడు జగన్‌ వెంట ఎక్కువగా ఆయనే ఫోకస్ అయ్యారు. అప్పట్లో పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్, బహిరంగ సభల ఏర్పాటు సహా అన్నికార్యక్రమాలు ఆయనే చూశారు. అటువంటి నేత ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు. దీనికి కారణం వైసీపీ అధికారంలోకి వచ్చినా ఇంకా ఏ పదవి ఇవ్వకపోవడమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎమ్మెల్సీ పదవిపై చిన్నశ్రీను ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇప్పటికే బొత్స తోపాటు ఆయన తమ్ముడు అప్పలనరసయ్య కూడా ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో చిన్న శ్రీనుకు ఎమ్మెల్సీ రావడం కష్టమే అంటున్నారు.

అయితే చిన్న శ్రీనుకు త్వరలో కీలక పదవి రాబోతోందని జిల్లాలో ప్రచారం మొదలయింది. త్వరలో ఏర్పాటు అయ్యే ప్రాంతీయ మండళ్లలో విజయనగరం లేదంటే విశాఖ కేంద్రంగా ఏర్పడనున్న ప్రాంతీయ మండలికి చైర్మన్ గా మజ్జి శ్రీనును ఎంపిక చేస్తారన్న టాక్ వినబడుతోంది. ఈ పదవి కోసం సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పేర్లను కూడా పరిశీలిస్తున్నారట. అయితే చిన్న శ్రీనుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. పైగా మేనమామ బొత్స అండదండలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. అయితే ఈ పదవిపై విశాఖ జిల్లాకు చెందిన వంశీకృష్ణ శ్రీనివాస్, శ్రీకాకుళం జిల్లాకు చెందిన దువ్వాడ శ్రీనివాస్ సైతం ఆశలు పెట్టుకున్నారు. వంశీకృష్ణ తన సీటును త్యాగం చేస్తే.. శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్ అతి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.

Tags:    

Similar News