మార్కెట్‌ చైర్మన్లలో సగం మహిళలకే..కమిటీల్లో కూడా..

Update: 2019-10-03 11:32 GMT

మార్కెట్‌ కమిటీలను వెంటనే నియమించాలని ముఖ్యమత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. కమిటీల్లో ఎస్సీ-ఎస్టీ-బీసీ, మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని సూచించారు. క్యాంప్ ఆఫీస్‌‌లో మార్కెటింగ్ అండ్ సహకారశాఖలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. మార్కెట్‌ ఛైర్మన్ పదవుల్లో సగం మహిళలకే ఇవ్వాలన్న జగన్ కమిటీల్లో కూడా సగం మహిళలకే కేటాయించాలని ఆదేశించారు. అక్టోబర్ చివరినాటికి మార్కెట్‌ కమిటీలను ఏర్పాటు చేయాలని అధికారులకు జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.

ఇక, జిల్లా సహకార బ్యాంకుల నష్టాలపై ఒక కమిటీ వేయాలన్న జగన్మోహన్ రెడ్డి వాటిని బలోపేతం చేయడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలని ఆదేశించారు. సహకార రంగాన్ని పూర్తిస్థాయిలో పునర్ వ్యవస్థీకరించాలన్న జగన్ అవినీతి-పక్షపాతానికి తావులేని విధానం ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆప్కో పునరుద్ధరణ, బలోపేతంపై కూడా అధ్యయనం చేయించాలని సీఎం ఆదేశించారు. అలాగే, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను కంప్యూటరీకరించే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇవన్నీ ఆరు నెలల కాలంలోనే అధ్యయనం పూర్తిచేసి సిఫార్సులు అమలు మొదలయ్యేలా యాక్షన్ ప్లాన్ సిద్ధంచేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

ఇక, పంట ప్రారంభంలోనే మద్దతు ధర ప్రకటించాలని అధికారులకు సూచించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరు నెలల్లో దళారి వ్యవస్థను రూపు మాపాలని ఆదేశించారు. ధరల స్థిరీకరణ, కనీస మద్దతు ధర, మార్కెట్లో ప్రభుత్వం జోక్యం చేసుకున్నాక పరిస్థితి కచ్చితంగా మారాలని, సర్కారు భరోసా ఇచ్చిందన్న నమ్మకం రైతుల్లో కలగాలన్నారు. ఇక, రాయలసీమను మిల్లెట్స్ హబ్‌గా మార్చాలన్న జగన్మోహన్ రెడ్డి అందుకోసం నిపుణులతో బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మొత్తం వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళనచేసి, బాగు చేద్దామన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందుకోసం ఏంచేయాలో అది చేద్దామని, అందుకోసం సూచనలు సలహాలు ఇవ్వాలని అధికారులను కోరారు.


Tags:    

Similar News