Andhra Pradesh: నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.

Update: 2020-01-18 02:58 GMT
చంద్రబాబునాయుడు (ఫైల్ ఫోటో)

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. అమరావతి పరిరక్షణ కమిటీ పేరుతో జిల్లాలో జరిగే ప్రజా చైతన్య యాత్రలో చంద్రబాబు పాల్గొననున్నారు. చంద్రబాబు తో సహా జేఏసీ నేతలు భీమవరం, పాలకొల్లు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. రాజధాని మార్పుతో కలిగే ఇబ్బందులను ఈ సందర్బంగా అక్కడి ప్రజలకు వివరించనున్నారు. కాగా ఇప్పటికే కృష్ణా, చిత్తూరు, ప్రకాశం, తూర్పు గోదావరి, అనంతపురం జిల్లాల్లో పర్యటించిన చంద్రబాబు అమరావతి ఉద్యమం కోసం జోలె పట్టారు. అలాగే రాష్ట్ర రాజధాని అమరావతిలోని ఉండేలా ప్రజలు ఉద్యమించాలని కోరారు.

అంతేకాదు విశాఖలో జగన్ వర్గీయులు భారీగా భూములు కొన్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఇదిలావుంటే ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానుల ఉంటాయేమోనన్న సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలపై గత 31 రోజులుగా అమరావతి ప్రాంతంలో రైతుల నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్ ను అమరవాతి పరిరక్షణ సమితి ప్రతినిధులు కలిశారు. ఈ సందర్బంగా మహిళలపై పోలీసులు దాడులు చేస్తున్నారని, అలాగే రాజధాని విషయంలో జోక్యం చేసుకోవాలని వారు గవర్నర్ ను కోరారు.

ఇక బోగి పండగ సందర్బంగా రాజధాని పరిరక్షణ సమితీ ఆధ్వర్యంలో విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర భోగి మంటలు వేసి.. జీఎన్ రావు కమిటి, బోస్టన్ కమిటి ఇచ్చిన నివేదిక ప్రతులను భోగి మంటల్లో వేసి కాల్చి నిరసన తెలియజేశారు. అనంతరం మూడు రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు. వైసీపీ తప్ప మిగితా పార్టీలన్ని అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతున్నాయని చంద్రబాబు చెప్పారు. ఒక్క వ్యక్తి స్వార్ధం వల్ల ఏపీ దారుణంగా దెబ్బతింటుందని ఆయన విమర్శించారు. మూడు రాజధానులపై రాష్ట్రంలో ఎన్నికల రెఫరెండం పెట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.  

Tags:    

Similar News