పోలవరంలో నిపుణుల కమిటీ పర్యటన

ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును పరిశీలించడానికి నిపుణుల బృందం ఇవాళ రాష్ట్రానికి వచ్చింది.

Update: 2019-12-28 04:04 GMT

ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును పరిశీలించడానికి నిపుణుల బృందం ఇవాళ రాష్ట్రానికి వచ్చింది. హెచ్‌కే హల్దార్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ శనివారం నుంచి మూడు రోజులపాటు ప్రాజెక్టు పనులను పరిశీలించనుంది. ఢిల్లీ నుంచి శుక్రవారం రాత్రి విశాఖపట్నం చేరుకుంది ఈ కమిటీ శనివారం పోలవరం ఎడమ కాలువ పనులను పరిశీలించి, రాత్రికి రాజమహేంద్రవరానికి చేరుకుంటుంది. ఆ తరువాత ఆదివారం ఉదయం పోలవరం వద్దకు వెళుతుంది. అక్కడ జలాశయం పనులు పరిశీలించనుంది.

సోమవారం (ఈ నెల 30న) కుడి కాలువ పనులను పరిశీలించి.. మధ్యాహ్నం విజయవాడలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అలాగే జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనుంది. ఈ సందర్బంగా పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, కేంద్రం నుంచి రావాల్సిన, వచ్చిన నిధులపై చర్చ జరపనుంది. ఆ తరువాత గురువారం(జనవరి 2)న కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు నివేదిక సమర్పించనుంది.

ఇదిలావుంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం 2017 లో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. ఈ నేపథ్యంలో మూడు నెలలకోసారి ప్రాజెక్టు పనులను పరిశీలించి.. క్వాలిటీని చెక్ చేసుకుంటుంది. ఆ తరువాత ఎప్పటికప్పుడు నివేదికలను కేంద్ర జలశక్తి అధికారులకు అందజేస్తోంది. అయితే ఇటీవల ఈ కమిటీని పునర్‌వ్యవస్థీకరించింది కేంద్రం. గతంలో ఈ పనులను పరిశీలించేందుకు సీడబ్ల్యూసీ(సెంట్రల్ వాటర్ కమిషన్) చైర్మన్‌ మసూద్‌ హుస్సేన్‌ అధ్యక్షతన కొత్తగా నిపుణుల కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది.

అయితే మసూద్‌ హుస్సేన్‌ ఇటీవల పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో నిపుణుల కమిటీ చైర్మన్‌గా వైకే శర్మను నియమించింది. మరోవైపు ప్రస్తుత సీజన్‌లో కాఫర్‌ డ్యామ్‌తోపాటు స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ పనులను పూర్తి చేయడానికి అవసరమైన నిధులను, కాంటూర్‌ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించే అంశంపై కేంద్ర నిపుణుల కమిటీకి వివరించేందుకు రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.  

Tags:    

Similar News