AP Municipal Elections: నూటికి నూరు శాతం హామీలను జగన్ నెరవేర్చారు: బొత్స
AP Municipal Elections:
బొత్స సత్య నారాయణ (ఫైల్ ఫొటో)
AP Municipal Elections: మున్సిపోల్స్‌లో వైసీపీ విజయదుందుభి మోగించిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. జగన్ 22 నెలల పాలనకు ఈ ఫలితాలు అద్దం పడుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ పనితీరుకు ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీలను నూటికి నూరు శాతం జగన్ నెరవేరుస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో మరింత బాధ్యతగా పని చేస్తామని హామీ ఇచ్చారు. ఇక టీడీపీ ఒక సామాజికవర్గ పార్టీగా మారిపోయిందని విమర్శించారు.
సజ్జల రామకృష్ణ రెడ్డి
వైసీపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారని సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు. జగన్ 22 నెలల పాలనకు ఈ ఫలితాలు అద్దం పడుతున్నాయని తెలిపారు. ఈ ఫలితాలతో వైసీపీ మరోసారి చరిత్ర సృష్టించిందన్నారు. జగన్ పాలనపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. భారీ విజయం అందించిన ప్రజలకు సజ్జల కృతజ్ఞత తెలిపారు.
ఎమ్మెల్యే ఎలిజా
సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే వైసీపీని గెలిపించాయని చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ కంచుకోటగా ఉన్న జంగారెడ్డిగూడెంలో కూడా వైసీపీ సత్తా చాటిందని వెల్లడించారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెబుతున్న చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా అన్నారు.
లక్ష్మీపార్వతి
టీడీపీని చంద్రబాబు భ్రష్టుపట్టించారని తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతి ఆరోపించారు. మున్సిపాల్, కర్పోరేషన్ ఎన్నికలతో ఆ పార్టీ పూర్తిగా భూస్థాపితం అయ్యిందని లక్ష్మీపార్వతి అన్నారు. ఇక తండ్రీ కొడుకులు పాలు, కూరగాయలు అమ్ముకోవాల్సిందేనని ఎద్దెవా చేశారు. ఇంకా 30 ఏళ్లపాటు జగన్ పరిపాలన కొనసాగుతుందని లక్ష్మీపార్వతి ఆశాభావం వ్యక్తం చేశారు.
వైసీపీ ఎమ్మెల్యే రోజా
మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయిందని నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రజలు వైసీపీకే పట్టం కట్టారని ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ గెలుపు ఒక చరిత్ర అన్నారు. ప్రతిపక్షాలతో పాటు రెబల్స్‌కు ప్రజలు గట్టి బుద్ధి చెప్పారన్నారు. మరో 25 ఏళ్లు జగనే సీఎంగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు.