తిరుమలలో అన్యమత ప్రచారం అవాస్తవం : సుబ్రమణ్యస్వామి సంచలనం

Update: 2019-12-30 02:37 GMT

తిరుమలలో అన్యమత ప్రచారం జరగలేదని బీజేపీ కీలకనేత, ఎంపీ సుబ్రమణ్యస్వామి అభిప్రాయపడ్డారు. గతంలో తిరుమల కొండపై చర్చి కడుతున్నారంటూ కొందరు దుష్ప్రచారం చేశారని.. అయితే అది వాస్తవం కాదని.. మార్ఫింగ్‌ చేసిన ఫొటోను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారని అన్నారు. మతకలహాలు సృష్టించేందుకు గత ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీనే ఈ విధంగా కుట్రలు పన్నుతోందని ఆయన పరోక్షంగా తెలుగుదేశం పార్టీని ఉద్ద్యేశించి వ్యాఖ్యానించారు. అంతేకాదు హిందువైన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని క్రిస్టియన్ అని దుష్ప్రచారం చేశారు.. కానీ ఆయన హిందువే అని స్పష్టం చేశారు.

మత కలహాలు సృష్టించడానికే కొందరు వ్యక్తులు. లేదా రాజకీయ పార్టీలు ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇలా దుష్ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన టీటీడీకి సూచించారు. టీటీడీపై కావాలని దుష్ప్రచారం చేసే వారిపై పరువు నష్టం దావా వేసి, క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని కోరారు. టీటీడీ ఉద్యోగుల్లో క్రిస్టియన్లు ఎక్కువ మంది ఉన్నారన్న ఆరోపణలు వాస్తవం కాదని, దీనిపై కూడా తాను అన్ని వివరాలు తెలుసుకున్నానని.. '15 వేల మంది టీటీడీ ఉద్యోగుల్లో కేవలం 44 మంది మాత్రమే క్రిస్టియన్లు ఉన్నారని.. అది కూడా రవాణా విభాగంలో పనిచేస్తున్నారు. వారంతా కారుణ్య నియమాకాల కింద నియమితులయ్యారని.. వారిని వేరే శాఖలకు బదిలీ చేసే అంశాన్ని ఈఓ పరిశీలిస్తున్నట్టు సుబ్రమణ్యస్వామీ వెల్లడించారు.

అంతేకాదు గతంలో తిరుమల ఆలయ నిధులను భారీగా దుర్వినియోగం జరిగినట్లు ఆయన ఆరోపించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గత టీడీపీ ప్రభుత్వంలో టీటీడీ వ్యవహారాల్లో అవినీతిపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)ను నియమించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నట్టు స్వామి చెప్పారు. కాగా సుబ్రమణ్యస్వామి తమిళనాడుకు చెందిన నేత. బీజేపీ లో కీలకంగా వ్యవహరిస్తున్నారు . కరుడుగట్టిన హిందుత్వ వాదిగా సుబ్రమణ్య స్వామికి పేరుంది. ప్రస్తుతం ఆయన రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

Tags:    

Similar News