విశాఖలో జగన్ మాట్లాడకుండా ఉన్నది అందుకే : విష్ణు కుమార్ రాజు

Update: 2019-12-29 09:21 GMT

శనివారం విశాఖలో సీఎం జగన్‌ పర్యటించిన సంగతి తెలిసిందే.. విశాఖ ఉత్సవ్ ను ప్రారంభించిన సీఎం.. ఆ తరువాత ఏమి మాట్లాడకుండా వెళ్లిపోయారు. దాంతో ఈ పరిణామం చర్చనీయాంశం అయింది. అయితే సీఎం మౌనం రాజకీయంగా ఆయనకు అవసరమే అని అన్నారు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు. ప్రాంతాల మధ్య విబేధాలు రాకూడదనే సీఎం మాట్లాడకుండా అభిప్రాయం కలుగుతోందని అన్నారు. ఈ విషయంలో సీఎం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని.. బహుశా జనవరి మొదటి వారంలో బోస్టన్‌ గ్రూప్‌ నివేదిక వచ్చే వరకు జగన్‌ రాజధానిపై స్పష్టమైన ప్రకటన చేయకపోవచ్చని విష్ణు కుమార్‌ రాజు అభిప్రాయపడ్డారు.

విశాఖలో రాజధానిని పెట్టడానికి తమ పార్టీ బీజేపీ వ్యతిరేకించినా.. తాను వ్యక్తిగతంగా విశాఖకు రాజధాని రావడాన్ని ఆహ్వానిస్తున్నానని వెల్లడించారు. విశాఖలో రాజధానికి కావలసిన అన్ని అర్హతలు ఉన్నాయని ఆయన అన్నారు. కొంతమంది తమ రాజకీయ స్వార్ధం కోసమే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. రాజధానిని విభజించే క్రమంలో అమరావతిలోని రైతులకు తప్పకుండా న్యాయం చెయ్యాలని సీఎంకు సూచించారాయన.

కాగా విశాఖ ఉత్సవ్ లో భాగంగా మొదటిరోజు విశాఖ ఆర్కే బీచ్ కు విచ్చేసిన ముఖ్యమంత్రి జగన్ కార్నివాల్ ను లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు వీఎంఆర్డిఏ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. సుమారు 13 వందల కోట్ల రూపాయలతో విశాఖ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను ప్రతిపాదించిన తరువాత సీఎం జగన్ మొదటిసారి విశాఖకు వచ్చారు. ఈ సందరంగా విశాఖ ప్రజలతో పాటు వైసీపీ నేతలు, కార్యకర్తలు జగన్ కు ఘన స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి తాటిచెట్ల పాలెం - సిరిపురం మీదుగా 24 కిలోమీటర్ల వరకు వేలాది మంది జనం మానవహారం గా ఏర్పడి.. విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను ప్రకటించిన సందర్బంగా థాంక్యూ సీఎం అని చెప్పారు. దీంతో నగరంలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. 

Tags:    

Similar News