ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికోసం వైయస్ఆర్సిపి ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై కేంద్ర మాజీ మంత్రి, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు పి అశోక్ గజపతి రాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల అనంతరం సుదీర్ఘ విరామం తరువాత మీడియా ముందుకు వచ్చిన ఆయన ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ స్థాపనతో ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం మొఘలులు, తుగ్లక్ల పాలనను పోలి ఉందని, వారు కూడా రాజధానులను తరచూ మార్చుకునేవారని గుర్తుచేశారు.
తాము అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ అమరావతిలో రాజధాని అంగీకరించారని.. ఇప్పుడు అకస్మాత్తుగా ఈ అంశంపై తన వైఖరిని మార్చుకున్నారని ఆయన పేర్కొన్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణానికి 33,000 ఎకరాల భూమిని త్యాగం చేసిన రైతులకు న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజధాని సమస్యపై ప్రభుత్వం అకస్మాత్తుగా తన వైఖరిని ఎందుకు మార్చుకుందో ప్రజలకు చెప్పాలని అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన మొదటిరోజునుంచే ప్రభుత్వ విధాన నిర్ణయాలు ప్రజలను కలవరపెడుతున్నాయని ఆయన అన్నారు.