Tirumala: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో 14 రాష్ట్రాల నుంచి కళాకారులు
Tirumala: స్థానిక భక్తుల నుంచి అమెరికా భక్తుల వరకు అభినందనలు
Tirumala: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో 14 రాష్ట్రాల నుంచి కళాకారులు
Tirumala: కలియుగ వైకుంఠ నాధుడు కొలువైయున్న తిరుమల పుణ్యక్షేత్రంలో పచ్చ తోరణం నిత్య కళ్యాణంగా విరాజిల్లుతోంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కళాకారుల కోలాహలం భక్తుల మదిని దోచుకుంటుంది.వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కళాకారులు ఆయా సంప్రదాయం ఉట్టి పడేలా ప్రదర్శించే కళలను ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో 14 రాష్ట్రాల నుండి కళాకారులు విచ్చేసి వాహన సేవల్లో ప్రదర్శన లిచ్చేందుకు కళాబృందాలను టిటిడి ఏర్పాటు చేసింది. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో కళా ప్రదర్శనలకు కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఉన్నత స్థాయి అధికారులు, స్థానిక భక్తులతో పాటు అమెరికా నుండి కూడా భక్తుల అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మరింతగా భక్తులను ఆకట్టుకునేలా కళా రూపాలను ఎంపిక చేసింది టిటిడి. కళాబృందాల ప్రదర్శన వీడియోలను ముందుగానే తెప్పించుకుని పరిశీలించి తర్వాత ఎంపిక చేసింది టిటిడి. ఇందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, అస్సాం, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా, పశ్చిమబెంగాళ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, మణిపూర్ తదితర రాష్ట్రాల నుండి కళాబృందాలు వచ్చాయి. ఆయా రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ నృత్యంతో పాటు జానపద నృత్యాలు చేయగా, స్థానికులైన తిరుమలలోని బాలాజి నగర్, తిరుపతికి చెందిన పలు కళాబృందాలకు సైతం టిటిడి ప్రాధాన్యం ఇచ్చింది. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు ఆంధ్రప్రదేశ్, రెండోరోజు కర్ణాటక, మూడోరోజు తమిళనాడు, నాలుగోరోజు తెలంగాణ, ఐదోరోజైన గరుడసేవనాడు అన్ని రాష్ట్రాల కళాబృందాలు, మిగతా రోజుల్లో కొన్ని రాష్ట్రాలు కలిపి కళాప్రదర్శనలు ఇవ్వనున్నారు.
టీటీడీకి చెందిన ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థులు ఉదయం, రాత్రి వాహనసేవల్లో సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శన ఇచ్చారు. వీరితో పాటు ఎస్వీ బాలమందిరం విద్యార్థులు కోలాటం, బర్డ్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ల బృందం వేషధారణ వేయగా, వాహన సేవలతో పాటు తిరుమలలోని ఆస్థాన మండపం, నాదనీరాజనం, తిరుపతిలోని పలు కళా వేదికలపై సాంస్కృతిక కార్యక్రమాలను టిటిడి నిర్వహిస్తుంది.శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన సోమవారం ఉదయం చిన్నశేష వాహనసేవలో కర్ణాటక రాష్ట్రం నుంచి విచ్చేసిన కళాబృందాలు చక్కటి ప్రదర్శనలిచ్చాయి. శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో కొందరు కళాకారులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి, శేషువులు, గరుత్మంతుని వేషధారణలో ఉండగా మరికొందరు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలకు నృత్యం చేశారు.
వివిధ ప్రదేశాల నుంచి మొత్తం 15 బృందాల్లో 411 మంది కళాకారులు పాల్గొన్నారు. తమ తమ విన్యాసాలతో ఆకట్టుకున్నారు. స్వామివారి ఎదుట మాడ వీధుల్లో ప్రదర్శనలివ్వడం పూర్వజన్మ సుకృతమని సంతోషం వ్యక్తం చేశారు. చాలా కళాబృందాలు ఉండగా తమకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. టీటీడీ అధికారులు చక్కటి బస, భోజన ఏర్పాట్లు చేశారని తెలిపారు.